ఖలీల్‌వాడి/ కామారెడ్డి, మార్చి 5: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియెట్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ప్రథమ సంవత్సరం విద్యార్థులకు తెలుగు, హిందీ, సంస్కృతం, ఉర్దూ భాషా పరీక్షలు నిర్వహించారు. ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించిన పరీక్షల కోసం నిజామాబాద్ జిల్లాలో 57, కామారెడ్డి జిల్లాలో 38 సెంటర్లను ఏర్పాటుచేశారు. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 19,191మంది విద్యార్థులకు 18,438 మంది హాజరయ్యారని, 753మంది గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపూడి రవికుమార్ తెలిపారు.
మొత్తం 96.1శాతం మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారన్నారు. నగరంలోని నిర్మల హృదయ జూనియర్ కాలేజీని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు తనిఖీ చేశారు. విద్యార్థులు పరీక్ష రాస్తున్న తీరును పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. నిజామాబాద్‌లోని ఖిల్లా బాలుర, కంఠేశ్వర్‌లోని ఎస్సార్, సీఎస్ఐ, గోల్డెన్ జూబ్లీ, నిర్మల హృదయ, ఉమెన్స్ జూనియర్ కాలేజీలను జిల్లా ఇంటర్ విద్యాధికారి తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు చిన్నయ్య, రజీయొద్దీన్ అస్లాం, కనకమహాలక్ష్మి మరో తొమ్మిది సెంటర్లను, హై పవర్ కమిటీ సభ్యుడు శ్రీనాథ్ మూడు కేంద్రాలు, ఫ్లయింగ్ స్కాడ్ బృందం నర్సయ్య, బాలాజీ, యమున 22 కేంద్రాలు, బల్క్ అధికారి బుద్ధిరాజ్ మూడు సెంటర్లను తనిఖీ చేశారు.
కామారెడ్డిలో జనరల్ విభాగంలో 7,786 మందికి 7,555 మంది హాజరు కాగా.. 231 మంది గైర్హాజరు అయ్యారని ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు. ఒకేషనల్ విభాగంలో 1,444 మందికి 1,308 మంది హాజరు కాగా.. 136 మంది గైర్హాజరు అయ్యారన్నారు. మొత్తం 96.02శాతం మంది విద్యార్థులకు పరీక్ష రాసినట్లు తెలిపారు. కామారెడ్డిలోని శ్రీ ఆర్యభట్ట జూనియర్ కాలేజీలో ఏర్పాటుచేసిన పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ తనిఖీ చేశారు. మాల్ ప్రాక్టీస్‌కు తావు లేకుండా పరీక్షలు నిర్వహించాలని, ప్రతి విద్యార్థిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం లోపలికి అనుమతించాలని సిబ్బందికి సూచించారు.