కామారెడ్డి/ ఖలీల్వాడి, మార్చి 4 : ఉమ్మడి జిల్లాలో నేటి నుంచి ఈ నెల 25 వరకు ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి దాదాపు 55 వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. కామారెడ్డిలో 38, నిజామాబాద్లో 57 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగనున్నాయి. అరగంట ముందు విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించనున్నారు. ఉదయం 8.30 గంటల్లో పరీక్షా కేంద్రంలో ఉండాలి. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 18,469 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
ఇంటర్ మొదటి సంవత్సరానికి 8,743 మంది, ద్వితీయ సంవత్సరానికి 9,726 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. ఒకేషనల్ మొదటి సంవత్సరం 1,915, ద్వితీయ సంవత్సరం 1,390 మొత్తం 3,305 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. నిజామాబాద్ జిల్లాలో 36, 222 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందులో జనరల్ 15053 మంది కాగా, ఒకేషనల్ 2,736 మంది విద్యార్థులు ఉన్నారు. మొదటి సంవత్సరం పరీక్షలకు 17, 789 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు అధికారులు తెలిపారు. ద్వితీయ సంవత్పరం 13, 944 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందులో ప్రైవేట్ 2,128 మంది , ద్వితీయ సంవత్సరం రెగ్యులర్ 2042 మంది, ప్రైవేట్ 319 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని అధికారులు ఇప్పటికే సూచించారు.
పలు కేంద్రాల్లో సౌకర్యాలు కరువు
ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పా ట్లు, సౌకర్యాలు కల్పించినట్లు ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో అవే మీ కనిపించడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. కామారెడ్డి పట్టణంలోని ప్రైవేట్ కళాశాల్లో సీసీ కెమెరాలు, ఫ్యాన్లు ఉన్నప్పటికీ పలు మండలాల్లో అవి ఏర్పాటు చేయకపోవడం గమనార్హం.