నిజామాబాద్, నవంబర్ 24, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): గ్రామ పంచాయతీ రిజర్వేషన్ల అమలులో బీసీలకు అన్యాయం జరిగింది. కామారెడ్డి జిల్లాలో గతంతో పోలిస్తే అనూహ్యంగా 8 స్థానాలు కోత పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు పెద్ద ఎత్తున ఉద్యమం సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ సైతం ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామంటూ ప్రగల్భాలు పలికింది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో గందరగోళమైన చర్యలకు పాల్పడి హైకోర్టుతో చివాట్లు వేయించుకుంది. తీరా డెడికేషన్ రిపోర్ట్ పేరుతో కొత్తగా జీవో నెంబర్ 46 అమలు చేసి కామారెడ్డి జిల్లాలో బీసీలకు అన్యాయానికి గురి
చేసింది. 50శాతంలోపు రిజర్వేషన్ వర్తింపులోనూ కామారెడ్డిలో 8 స్థానాలు కోత పడటం సంబంధిత వర్గాలకు తీవ్ర అసంతృప్తికి గురి చేస్తోంది. 2019లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 526 గ్రామ పంచాయతీలుండగా 131 స్థానాలను బీసీలకు వర్తింప జేశారు. 2025లో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల సమయానికి జీపీల సంఖ్య 532కి పెరిగింది. గతంతో పోలిస్తే పంచాయతీల సంఖ్య 6 పెరిగాయి. అయినప్పటికీ మొత్తం రిజర్వేషన్ వర్తింపులో బీసీలకు వచ్చిన వాటాను పరిశీలన చేస్తే కేవలం 123 మాత్రమే ఉండటం వీస్తూ గొల్పుతోంది. ఈ విషయంపై వివరణ కోరేందుకు కామారెడ్డి జిల్లా పంచాయతీ అధికారిని సంప్రదించగా మాట్లాడేందుకు నిరాకరించారు.
కామారెడ్డి వేదికగా బీసీ డిక్లరేషన్ను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అదే కామారెడ్డి జిల్లాకు మోసం చేసిందని బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. గతంతో పోలిస్తే బీసీలకు గ్రామ పంచాయతీ స్థానాలు తగ్గడంపై వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీ డిక్లరేషన్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లను స్థానిక సంస్థల్లో అమలు చేస్తామని పెద్ద ఎత్తున పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి మాటిచ్చారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన రెండేళ్ల కాలంలో బీసీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. పైగా కామారెడ్డి జిల్లా ప్రజలకు న్యాయంగా దక్కాల్సిన రిజర్వేషన్ వాటా ప్రకారం 8 స్థానాలు తగ్గడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇదిలా ఉండగా మహిళా రిజర్వేషన్లను అమలు చేయడంతో నిజామాబాద్ జిల్లాలో మొత్తం 545 గ్రామ పంచాయతీలకు 244 సీట్లు స్త్రీలకు కేటాయించారు. వార్డులు 5022 ఉండగా 2152 మహిళలకే దక్కాయి. కామారెడ్డి జిల్లాలో మొత్తం 532 గ్రామ పంచాయతీలున్నాయి. మహిళలకు 242 కేటాయించారు. 4656 వార్డులుండగా 1995 మహిళలకు రిజర్వేషన్ వర్తింపజేశారు.

