సిటీబ్యూరో, మార్చి 2 (నమస్తే తెలంగాణ) : ఎంఎన్‌జే క్యాన్సర్ దవాఖాన.. అక్రమార్కులకు అది కాసులు కురిపించే కామధేనువులా మారింది. అక్కడ చక్రం తిప్పడానికి ఒకరు ఏకంగా పీజీ అవతారమెత్తితే మరొకరు కట్టప్ప అవతారమెత్తి సొంత సంస్థనే వెన్నుపోటు పొడిచాడని దవాఖాన వైద్యాధికారులు, సిబ్బంది మండిపడుతున్నారు. రోగులకు మెరుగైన వైద్యం అందించడాన్ని పక్కన పెట్టడంతో పాటు వైద్య విద్యార్థులకు పాఠాలు చెప్పకుండా నిరంతరం రాజకీయ నాయకుల పంచన, సచివాలయం చుట్టూ తిరుగుతూ, కొందరు అధికారులకు కొమ్ముకాస్తూ ఆస్పత్రికి సంబంధించిన నిధుల్లో అందినంత దండుకుంటున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సొంత సంస్థలో పనిచేసే వైద్యాధికారులను బజారులో దోషులుగా నెలబెట్టి, బయటి వ్యక్తిని తీసుకువచ్చి డైరెక్టర్ పదవి ముట్టచెప్పించడంపై సిబ్బంది ఆగ్రహంతో రగిలిపోతున్నారు.
నిరసనలతో అట్టుడికిన ఎంఎన్‌జే..
ఇటీవల ఎంఎన్‌జే దవాఖానలో నెలకొన్న సమస్యలు, అక్కడ జరుగుతున్న అక్రమాలపై వచ్చిన ఆరోపణలు, మీడియాలో వచ్చిన వార్తా కథనాలకు రాజకీయ రంగుపూసి, తప్పుదారి పట్టించి ఎంఎన్జేలో వైద్యుల మధ్య అంతర్గత విబేధాలు నెలకొన్నాయనే అపవాదును అంటగట్టారని, ఇక ఎంఎన్జెలో పనిచేసే వైద్యులు సమర్థులు కాదు, వారికి దవాఖాన నిర్వహణ చేతకాదనే వాతావరణాన్ని ఆమాత్యుల వద్ద సృష్టించి.. నిమ్స్ దవాఖాన వైద్యుడిని డైరెక్టర్‌గా నియమించడంలో కట్టప్ప పాత్ర పోషించి ఇటు సొంత సంస్థకు అన్యాయం చేయడమే కాకుండా అటు నిమ్స్ వైద్యుడికి సైతం అపవాదు తెచ్చిపెడుతున్నారని దవాఖాన సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దవాఖానలో పనిచేస్తున్న సీనియర్ మోస్ట్ వైద్యాధికారులకైనా కనీస సమాచారం లేకుండా, వారి అభిప్రాయాలు తెలుసుకోకుండా పూర్తిస్థాయి ప్రభుత్వ సీనియర్ వైద్యులపై సెమీ గవర్నమెంట్ సంస్థకు చెందిన జూనియర్ వైద్యుడిని దొడ్డిదారిలో డైరెక్టర్‌గా నియమించడంలో ఆ కట్టప్ప పన్నిన కుట్ర క్షమించరానిదని ఎంఎన్‌జే వర్గాలు మండిపడుతున్నాయి.
ఎంఎన్‌జె క్యాన్సర్ హాస్పిటల్ డైరెక్టర్‌గా నిమ్స్ అంకాలజీ వైద్యుడిని నియమించడంపై రెండవ రోజు కూడా నిరసనలు కొనసాగాయి. టీజీజీడీఏ యూనిట్-2, ఎంఎన్‌జే ఆంకాలజీ సంస్థ సిబ్బంది, ఫ్యాకల్టీతో పాటు ఇతర అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సోమవారం నల్లబ్యాడ్జీలు ధరించి కొంతసేపు విధులను బహిష్కరించారు. దవాఖానలోని సిబ్బంది మొత్తం నిరసనలో పాల్గొనడం, నిమ్స్ వైద్యుడి నియామకానికి వ్యతిరేకంగా చేసిన నినాదాలతో ఎంఎన్‌జే అట్టుడికింది.
ఈ సందర్భంగా టీజీజీడీఏ యూనిట్-2 అధ్యక్షులు డా.వినోద్, ప్రధాన కార్యదర్శి డా.సంధ్యారాణి, డా.శ్రీకాంత్, డా.రఘురామన్,డా.షీలా, డా.ప్రకాష్, డా.రమేష్ మాట్లాడుతూ.. ఇనిస్ట్టీట్యూట్లోని సీనియర్ ప్రొఫెసర్లను పకనపెట్టి ఈ నియామకం జరిగిందని, హెచ్ఓడీ నియామకాల నిబంధనలను ఉల్లంఘించారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎంఎన్‌జే ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రీజినల్ క్యాన్సర్ సెంటర్ డైరెక్టర్‌గా ఇతర సంస్థకు చెందిన వైద్యుడిని నియమించడం తమకు తీవ్ర అభ్యంతరకరమంటూ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎంఎన్‌జే లేదా డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధికి చెందని వ్యక్తిని డైరెక్టర్‌గా నియమించడం సంస్థ విధివిధానాలు, నియమ నిబంధనలకు పూర్తి విరుద్ధమని వాపోయారు. న్యాయమైన, సీనియారిటీ ఆధారిత నియామకం జరిగేవరకు తమ ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తామని ఎంఎన్‌జే వైద్య సిబ్బంది స్పష్టం చేశారు.
అంతర్గత విభేదాలు వాస్తవం కాదు..
ఎంఎన్జెలో వైద్యలు, సిబ్బంది మధ్య అంతర్గత విబేధాలు ఉన్నట్లు కొందరు చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం అని సిబ్బంది స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు ముగ్గురు డైరెక్టర్లు మారారని, అందులో మొదటి డైరెక్టర్ రాష్ట్రవ్యాప్తంగా జరిగిన దీర్ఘకాలిక బదిలీల్లో భాగంగా డా.జయలలిత బదిలీ అయ్యారని, ఇక 2వ డైరెక్టర్ డా.శ్రీనివాసులు ఆంధ్రాకు అలాట్ కావడంతో ఆయనను ప్రభుత్వమే తప్పించిందని వివరించారు.
ఇక మొన్నటి వరకు డైరెక్టర్‌గా కొనసాగిన డా.బెంజిమన్ హయాంలో దవాఖానలోని సమస్యలు ఎక్కడికక్కడ పేరుకుపోవడంతో వాటిని పరిష్కరించాలంటూ తాము ప్రభుత్వం, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, దీనిని ఓ కట్టప్ప తనకు అనుకూలంగా మార్చుకుని, ఎంఎన్జెలో వైద్యుల మధ్య అంతర్గత విభేదాలు ఉన్నట్లు ఉన్నతాధికారులు, ప్రభుత్వం వద్ద తప్పడు ప్రచారం సృష్టించి, తన పబ్బం గడుపుకునే విధంగా, సంస్థ హస్తగతం కోసం భవిష్యత్తు పునాదులు వేసుకునే విధంగా నిమ్స్‌కు చెందిన వైద్యుడిని డైరెక్టర్‌గా నియమించడంలో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపించారు. కాగా ఈ నియామకానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన అనంతరం ఇన్చార్జ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన నిమ్స్ వైద్యులు డా.సదాశివుడి వద్దకు నేరుగా వెళ్లి తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో టీఎన్జీఓ నాయకులు శివకుమార్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.