బాన్సువాడ టౌన్, ఏప్రిల్ 6: కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శనివారం రైతుదీక్షలు చేపట్టారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించిన ఈ దీక్షలకు పార్టీ శ్రేణులు, రైతులు పెద్దసంఖ్యలో తరలిచ్చారు. బాన్సువాడలో చేపట్టిన దీక్షలో మాజీ స్పీకర్ పోచారం, వేల్పూర్ ఎక్స్‌రోడ్డు వద్ద నిర్వహించిన దీక్షలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పాల్గొన్నారు. కామారెడ్డిలో గంప గోవర్ధన్, ఎల్లారెడ్డిలో జాజాల, పిట్లంలో హన్మంత్ షిండే, నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బాజిరెడ్డి గోవర్ధన్ ఆధ్వర్యంలో దీక్షలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తక్షణమే అమలుచేయాలని వారు డిమాండ్ చేశారు. ధాన్యానికి రూ.500 బోనస్ ఇవ్వాలని, రైతుబంధు ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికే రైతు దీక్షలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే అన్నారు. పిట్లంలో నిర్వహించిన రైతునిరసన దీక్షలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలోని రైతులు పండించిన వరికి క్వింటాలుకు రూ.500 బోనస్ ఇవ్వాలని, పంట ఎండిపోయిన రైతులకు ఎకరానికి రూ.25వేలు నష్టపరిహారం చెల్లించాలని, రూ.2లక్షల రుణమాఫీ తక్షణమే చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇబ్బందులు మొదలయ్యాయని, ఈ విషయాన్ని ప్రజలు, రైతులు గమనించాలని కోరారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ దఫేదార్ రాజు, జడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు అన్నారం వెంకట్రాంరెడ్డి, ప్రతాప్‌రెడ్డి, విజయ్, బాబుసింగ్, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆరు గ్యారెంటీలు గాలికి..
అబద్ధాలు, మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను గాలికి వదిలేసిందని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ విమర్శించారు. ఎల్లారెడ్డి పట్టణంలోని తెలంగాణతల్లి ప్రాంగణంలో నిర్వహించిన రైతుకు మద్దతు దీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతులు వడ్లు అమ్ముకోవద్దని, డిసెంబర్ 9వ తేదీన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, క్వింటాలుకు 500 రూపాయలు బోనస్‌గా ఇస్తామని, అప్పుడు ధాన్యం అమ్ముకోవాలని చిలకపలుకులు చెప్పిన రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాల కోరు అని విమర్శించారు. రేవంత్‌రెడ్డి నాలుగు నెలల్లోనే రాష్ట్రంపై రూ.16వేల కోట్ల అప్పు చేశాడన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
రైతుల్ని మోసం చేసిన కాంగ్రెస్
అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతులకు హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకొని కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. యాసంగిలో రైతులు పండించిన పంటకు మద్దతు ధరపై అదనంగా రూ.500 ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న రూ.రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తామని ఇప్పటికీ చేయలేదన్నారు. ఇటీవల కురిసిన వడగండ్ల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.25వేలు నష్ట పరిహారం చెల్లించాలని డిమాం డ్ చేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ పరికి ప్రేమ్‌కుమార్, కామారెడ్డి ఎంపీపీ పిప్పిరి ఆంజనేయులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.