నల్లగొండ రూరల్, మార్చి 18 : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న బడ్జెట్లో విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున డిమాండ్ చేశారు. బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి విద్యార్థులు, నిరుద్యోగ యువతకి అనేక హామీలు ఇచ్చిందన్నారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గద్దె ఎక్కిన తర్వాత విద్యా రంగాన్ని పూర్తిగా విస్మరించి బ్రష్టుపట్టించారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఈ నెల 20న ప్రవేశ పెట్టే బడ్జెట్లో విద్యా రంగానికి అధిక నిధులు కేటాయించి విద్యార్థి లోకానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.
అదే విధంగా జాబ్ క్యాలెండర్ అమలు చేసి రెండు లక్షలు ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. మరి ముఖ్యంగా గురుకుల పాఠశాల విద్యార్థులు చనిపోకుండా బడ్జెట్లో ప్రత్యేక నిధులు ఏర్పాటు చేసి విద్యార్థులకి మౌలిక వసతులు కల్పించాలని కోరారు. అదే విధంగా అన్ని విశ్వ విద్యాలయాలకు అభివృద్ధి, మౌలిక వసతుల కోసం నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో నోముల శంకర్ యాదవ్, నోముల క్రాంతి యాదవ్, బక్రమ్ నరేందర్, సైదులు, వెంకన్న, లింగస్వామి, శ్రీకాంత్, నాగరాజు, శ్రీశైలం పాల్గొన్నారు.