ఆర్మూర్ టౌన్, మే 22: నిజామాబాద్ జిల్లా నూనె గింజల సాగులోనూ ప్రత్యేకతను సాధించింది. నూనె గింజలను సాగుచేసే రైతులకు కేసీఆర్ ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలను అందించి, వారికి శిక్షణ సైతం ఇప్పించింది. ఆర్మూర్ మండలం చేపూర్ శివారు నర్సరీలో మొక్కలు సిద్ధం చేసి, ఔత్సాహికులకు అందించింది. జిల్లాలో ఆయిల్ పాం సాగు చేసే రైతులతో బైబ్యాక్ ఒప్పందం కింద ప్రియూనిక్ ఇండియా లిమిటెడ్ కంపెనీతో సర్కారు ఒప్పందాలు చేసింది.
దీంతో జిల్లాలో వందల ఎకరాల్లో ఆయిల్ పాం మొక్కలు నాటగా పంట కోత దశకుచేరింది. ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో రైతు మార వెంకట్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో 2022లో నాటిన ఆయిల్ పాం మొక్కలు ఏపుగా పెరిగి గెలలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అంకాపూర్ గ్రామంలో మున్నూరు కాపు సంఘంలో ఉద్వాన, పట్టు పరిశ్రమ శాఖ, ప్రియూనిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో గురువారం మొదటి గెలల కోత, సేకరణ ప్రారంభోత్సవం కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి పసుపు బోర్డు అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి,మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, ఉద్యాన, పట్టు పరిశ్రమ,ప్రి యూనిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అధికారులు, రైతులు పాల్గొన్నారు.