ఇందిరమ్మ ఇండ్ల కమిటీల కూర్పు వివాదాస్పదమవుతున్నది. కాంగ్రెస్ కనుసన్నల్లోనే ఈ ప్రక్రియ జరుగుతుండడం విమర్శలకు తావిస్తున్నది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా వారే పెత్తనం కొనసాగిస్తుండడం రాజకీయ దుమారానికి తెర లేపుతున్నది. మరోవైపు, అధికార పార్టీలో కమిటీల కూర్పు కల్లోలం రేపుతున్నది. ఎమ్మెల్యేల నేతృత్వంలో జాబితా రూపకల్పన జరగాల్సి ఉండగా, కాంగ్రెస్ లీడర్లే స్వయంగా జాబితాను రూపొందిస్తుండడం చిచ్చు రేపుతున్నది. ఈ నేపథ్యంలోనే పలు చోట్ల వివాదాలు చుట్టుముడుతున్నాయి.
-నిజామాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
బాన్సువాడ నియోజకవర్గంలో కమిటీల లొల్లి తారస్థాయికి చేరింది. కాంగ్రెస్ గూటికి చేరిన మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో మండలాల వారీగా ఇందిరమ్మ కమిటీల కూర్పు చేపట్టారు. ఈ మేరకు జాబితాలను ఎంపీడీవోలకు పంపించారు. ఇందుకు ప్రతిగా మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నేత ఏనుగు రవీందర్‌రెడ్డి సైతం మరో జాబితాను రూపొందించి అధికార యంత్రాంగానికి పంపించడం తీవ్ర దుమారం రేపుతున్నది. బాన్సువాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య ప్రచ్ఛన్న యుద్ధం తారస్థాయికి చేరిందనడానికి ఇందిరమ్మ కమిటీల కూర్పే నిదర్శనంగా నిలిచింది. సవాళ్లు, ప్రతి సవాళ్లతో పోచారం, ఏనుగు మధ్య రాజకీయ పోరు మరింత ముదిరింది. ఫలితంగా కాంగ్రెస్ పార్టీ కేడర్‌లో అయోమయం నెలకొన్నది.
ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు ఉన్న చోట పరిస్థితి ఘోరంగా మారింది. అధికార కాంగ్రెస్ పార్టీ నేతల పెత్తనంతో జాబితా రూపకల్పన గందరగోళంగా మారుతున్నది. కామారెడ్డిలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఇచ్చిన జాబితాను కాదని కాంగ్రెస్ నేతలు పంపిన జాబితాను మున్సిపల్ అధికారులు ఖరారు చేస్తుండడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కామారెడ్డి మున్సిపాలిటీలో ఇందిరమ్మ ఇండ్ల పథకానికి వార్డు కమిటీల ఏర్పాటులో బీఆర్ఎస్ కౌన్సిలర్లు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డుల్లో అర్హులైన పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఆయా సామాజిక వర్గాల ఆధారంగా చోటు కల్పించేందుకు పూనుకున్నారు.
కౌన్సిలర్ అధ్యక్షతన ఎస్‌హెచ్‌జీ నుంచి ఇద్దరు మహిళలు, వార్డులో ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల నుంచి ఒక్కొక్కరికి చోటు కల్పించారు. సంబంధిత వార్డుకు ప్రాతినిధ్యం వహించే మున్సిపల్ ఉద్యోగి కన్వీనర్‌గా బాధ్యత వహించాల్సి ఉంది. బీఆర్ఎస్ కౌన్సిలర్లు కారంగుల అంజల్రెడ్డి, పిట్ల వేణు, అఫీజ్, స్వప్న, నజీరొద్దీన్, భాస్కర్ ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డుల్లో వారిని సంప్రదించకుండానే మున్సిపల్ అధికారులు ఏకపక్షంగా వార్డు కమిటీలను ఖరారు చేశారు.
ఇందులో కాంగ్రెస్ నాయకుల పేర్లను చేర్చారు. 43వ వార్డులో నివసించే మాజీ వైస్ చైర్మన్ మసూద్ అలీ 25వ వార్డు కమిటీలో ఎలా సభ్యుడిగా ఉంటారని బీఆర్ఎస్ కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్‌ను నిలదీశారు. 47వ వార్డులోనూ మొత్తం కాంగ్రెస్ నేతలకే చోటు కల్పించారని మండిపడ్డారు. సమాధానం చెప్పాల్సిన మున్సిపల్ అధికారులు స్పందించకపోగా అధికార పార్టీ నేతలకే వత్తాసు పలుకుతూ ఇందిరమ్మ కమిటీ కూర్పుపై ముందుకు వెళ్తున్నారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఇచ్చిన పేర్లను కాదని రాత్రికి రాత్రే కాంగ్రెస్ నేతలు ఇచ్చే జాబితాను అధికారికంగా స్వీకరించడం నిబంధనలకు విరుద్ధమంటూ కౌన్సిలర్లు చెబుతున్నారు. అధికారిక కార్యక్రమాల్లో హస్తం పెత్తనం ఏ మాత్రం సహించేది లేదంటూ బీఆర్ఎస్ కౌన్సిలర్లు చెబుతున్నారు.
మార్చి 11న ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకాన్ని ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించగా, నియోజకవర్గానికి 3500 చొప్పున ఇండ్లు మంజూరు చేశారు. ఈ పథకం కింద ఇండ్ల కోసం దరఖాస్తులు ఆహ్వానించగా, ఉమ్మడి జిల్లాలో లక్షల్లో వచ్చాయి. నిజామాబాద్ జిల్లాలోనే 3,32,663 మంది ఇందిరమ్మ ఇండ్లు మం జూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. గ్రామ సభల్లో లబ్ధిదారుల ఎంపిక చేపట్టనున్నారు.
నిజామాబాద్ జిల్లాకు దాదాపుగా 19 వేల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యే అవకాశాలున్నా యి. కానీ దరఖాస్తులు మాత్రం లక్షల్లో ఉన్నాయి. కామారెడ్డిలోనూ 2 లక్షలకు పైగా దరఖాస్తులు రాగా, సుమారుగా 12వేల ఇందిరమ్మ ఇండ్లు వచ్చే వీలుంది. లక్షల్లో ఆశావాహులు ఉండగా మం జూరు మాత్రం వేలల్లోనే ఉండడంతో ఎవరికి లబ్ధి చేకూరుతుందన్నది అయోమయంగా మారిం ది. నిజమైన పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఊరట దక్కుతుందా? లే దా? అన్నది వేచి చూడాల్సి ఉంది.
బాన్సువాడ నియోజకవర్గంలో అధికార పార్టీ నుంచి రెండేసి జాబితాలు రావడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఏమి చేయాలో తెలియక ఉన్నతాధికారులకు వాస్తవ పరిస్థితిని రిపోర్ట్ చేశారు. చివరకు రెండు జాబితాలను ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు పంపించి పక్కకు జరిగారు. ఈ నేపథ్యంలో ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. మరోవైపు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో తెర వెనుక కాంగ్రెస్ నేతలు ఇందిరమ్మ కమిటీల్లో పరకాయ ప్రవేశం చేస్తున్నారు. ఎమ్మెల్యేను కాదని జాబితాను రూపొందిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు.
కామారెడ్డి మున్సిపాలిటీలో జరిగిన తంతు ఇందుకు ఉదాహరణ కాగా, ఇన్చార్జి మంత్రి ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారో వేచి చూడాలి. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ తంతులో మంత్రి జూపల్లి పేరునే అధికార యంత్రాంగం బద్నాం చేస్తున్నది. పది నెలల కాంగ్రెస్ పరిపాలనలో ఇన్చార్జి మంత్రి చుట్టపు చూపునకే పరిమితమయ్యారు. ఉమ్మడి జిల్లా టూర్‌కు వచ్చి సమీక్షలు, సమావేశాలు నిర్వహించకపోవడంతో అధికారుల్లో భయం లేకుండా పోయింది. జిల్లా కలెక్టర్లు సైతం ఇన్చార్జి మంత్రి పేరు చెప్పి కాలం గడిపేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.