రామారెడ్డి, జూన్ 26 : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న ఇందిరమ్మ ఇండ్ల పథకమేమో కానీ, కొన్ని పేద కుటుంబాలు రోడ్డున పడ్డాయి. గుడిసెలను కూల్చి ఇండ్లు కట్టుకుందామనుకున్న పేదల ఆశలు గల్లంతయ్యాయి. ఉన్న గూడును కోల్పోయి ఇండ్ల నిర్మాణాలు మధ్యలో నిలిచిపోయి.. దిక్కులేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. అందుకు రామారెడ్డి మండలంలోని కన్నాపూర్ తండాలోని కొన్ని కుటుంబాలే ప్రబల సాక్ష్యంగా నిలుస్తున్నాయి.
ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని కన్నాపూర్ తండాను ఇందిరమ్మ ఇండ్ల పథకానికి పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఇక్కడ నివాసముంటున్న 86 పేద కుటుంబాలను గుర్తించి ఇండ్లు మంజూరు చేశారు. ఒక్కో ఇల్లు నిర్మాణానికి ప్రభుత్వం విడుతల వారీగా రూ.5 లక్షల చొప్పున అందజేస్తుందని చెప్పడంతో 19 మంది ఇండ్ల నిర్మాణానికి ముందుకొచ్చారు. కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ వచ్చి స్వయంగా ఇండ్ల నిర్మాణాలకు ప్రారంభోత్సవం చేశారు. ఆయా నిర్మాణాలకు మార్చిలో మార్కింగ్ చేశారు. ప్రస్తుతం 10 ఇండ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉండగా, ఆరింటిని అసలు ప్రారంభించనే లేదు. అయితే, మరో మూడు ఇండ్లకు అధికారులు కొర్రీలు పెట్టి ఆపేశారు. ఇక, పనులు కొనసాగిస్తున్న ఇండ్లకు అసలు బిల్లులే చెల్లించలేదు.
ఇందిరమ్మ ఇండ్ల పథకంతో తమ సొంతింటి కల నెరవేరుతుందనుకున్న గిరిజన కుటుంబాల ఆశ మధ్యలోనే ఆగిపోయింది. గుడిసెలను పీకేసి ఇండ్ల నిర్మాణం ప్రారంభించిన వారికి నిరాశే మిగిలింది. దశాబ్దాలుగా గుడిసెల్లో నివాసముంటున్న మూడు గిరిజన కుటుంబాలు ఇండ్ల నిర్మాణాలు చేపట్టగా, అధికారులే ఇప్పుడు అడ్డు పడడం వారిని తీవ్ర ఆవేదనకు గురి చేసింది. ఆయా ఇండ్లు అటవీ భూముల్లో
ఉన్నాయని ఫారెస్టు అధికారులు బేస్మెంట్ దశలో ఉన్న ఇంటి నిర్మాణాలను అడ్డుకున్నారు. దాదాపు 40 ఏండ్లుగా గిరిజన కుటుంబాలు ఆ భూముల్లోనే గుడిసెలు, పశువుల పాకలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నాయి. ఇందుకు గ్రామపంచాయతీకి పన్నులు కూడా చెల్లిస్తూ వస్తున్నారు.
ఇన్నేండ్లుగా ఎప్పుడూ అభ్యంతరం చెప్పని అధికారులు.. ఇండ్ల నిర్మాణం ప్రారంభించి, బేస్మెంట్ లెవల్‌కు వచ్చాక అడ్డుకోవడంపై లబ్ధిదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నేండ్లుగా పంచాయతీకి పన్ను లు చెల్లించినప్పుడు అటవీ భూములని అధికారులకు తెలియదా? అని ప్రశ్నిస్తున్నారు. దశాబ్దాలుగా గుడిసెల్లో ఉన్నప్పుడు గుర్తుకు రాని అటవీ భూములు ఇప్పుడు గుర్తొచ్చాయా? ఇండ్ల నిర్మాణానికి మార్కింగ్ చేసినప్పుడే అటవీ భూములని చెబితే అయిపోయేదని, కానీ ఇప్పుడు బేస్మెంట్కు వచ్చాక అడ్డుకోవడమేమిటని వాపోతున్నారు.
మరోవైపు, కన్నాపూర్ తండాలో నిర్మిస్తున్న ఇండ్లకు బిల్లులు రాక లబ్ధిదారులు సతమతమవుతున్నారు. కొందరు అప్పులు తెచ్చి నిర్మాణ పనులు ప్రారంభించారు. అయితే, ప్రభుత్వం నుంచి డబ్బులు రాకపోవడంతో సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే నిర్మాణ పనులను మధ్యలోనే నిలిపేస్తున్నారు. తండాకు చెందిన సునీత నిర్మాణం స్లాబ్ లెవల్‌కు వచ్చినా సర్కారు నుంచి నయా పైసా రాలేదు. దీంతో ఆమె పనులను మధ్యలోనే నిలిపి వేశారు. ఇక, ఫారెస్ట్ భూముల్లో ఇండ్ల నిర్మాణానికి మార్కింగ్ చేసినట్లు తెలిసి ఉన్నతాధికారులు సీరియస్ అయినట్లు తెలిసింది. బాధ్యులైన వారికి మెమోలు కూడా జారీ చేసినట్లు సమాచారం.
వివిధ శాఖల అధికారుల నిర్లక్ష్యం గిరిజన కుటుంబాలకు శాపంగా మారింది. శాఖల మధ్య సమన్వయ లోపం ఆయా కుటుంబాలను రోడ్డున పడేసింది. గుడిసెను తీసేసి సొంతింట్లో హాయిగా జీవిద్దామనుకున్న వారి కలను కలగానే మిగిల్చింది. స్వయంగా కలెక్టర్ వచ్చి ఇంటి నిర్మాణాలను ప్రారంభించడంతో గిరిజనుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. రెట్టించిన ఉత్సాహంతో, ప్రభుత్వం నుంచి బిల్లులు వస్తాయన్న ఆశతో అప్పులు తెచ్చి నిర్మాణ పనులు ప్రారంభించారు.
అయితే, వారి ఆశలకు అధికారులు గండికొట్టారు. ఫారెస్టు అధికారులు తాపీగా వచ్చి ఇవి ఫారెస్టు భూములని ఇండ్లను అడ్డుకోవడం లబ్ధిదారులను దిక్కు తోచని స్థితిలో పడేసింది. ఇల్లు స్లాబ్ దశకు వచ్చాక అడ్డుకోవడంపై కాట్రోత్ సునీత అసహనానికి లోనయ్యారు. ఇప్పటిదాకా తమకు ప్రభుత్వం నుంచి బిల్లులు రాలేదని ఆమె ఆవేదన చెందుతున్నారు. మరోవైపు, ఇన్నాళ్లు జీపీకి పన్నులు కట్టామని, ఇంటి పనులు ప్రారంభించాక ఇప్పుడు ఫారెస్టు భూములని చెప్పడమేమిటని ఇందిరమ్మ లబ్ధిదారులు కాట్రోత్ జ్యోతి, విస్లావాత్ లక్ష్మి వాపోయారు. ఉన్నతాధికారులు చొరవ తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.