Indiramma Atmiya Bharosa | ఎల్లారెడ్డి, మే 1: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అభాసుపాలవుతున్నది. రెండున్నరేండ్ల క్రితం అధికారంలోకి వస్తే భూమిలేని నిరుపేదలకు రైతు భరోసాలాంటి పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ దాని అమలును అటకెక్కించింది. ఏడాది కాలంలో 20 రోజుల పాటు ఉపాధి హామీ పనులు చేసిన కూలీలకు గుంట భూమి కూడా లేకుంటే ఏడాదికి రూ.12 వేలు (ఆరు నెలలకోసారి రూ. 6 వేల చొప్పున) ఇస్తామని ఎన్నికల సమయంలో ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకం కాగితాలకే పరిమితమైంది. తూతూ మంత్రంగా అమలుచేసి అటకెక్కించింది.
కనీసం గుంట భూమి కూడా లేని నిరుపేద కూలీలు ఈ పథకంపై ఆశలు పెట్టుకున్నారు. భూమి ఉన్న రైతులకు పంట సాయం కోసం కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం లక్షలాది కుటుంబాలకు అండగా నిలిచింది. రైతుల జీవితాల్లో వెలుగులు నింపింది. కాంగ్రెస్ పార్టీ అధికార దాహం కోసం ప్రకటించిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ఆదిలోనే అంతమైందని ఉపాధి కూలీలు విమర్శిస్తున్నారు. ఎల్లారెడ్డి మండలంలోని మల్లయపల్లి గ్రామంలో రెండేండ్ల క్రితం తూతూ మంత్రంగా ఒకేసారి కేవలం ఒకే ఒక్కరికీ కేవలం ఆరు వేల రూపాయలు అందించి వారిని ఆశల పల్లకీలో ఊరేగిస్తున్నది. కేవలం ఎల్లారెడ్డి మండలంలోని 31 గ్రామాల్లో ఈ పథకం కోసం 573 మంది దరఖాస్తు చేసుకున్నారు.
వారు ఉపాధి హామీ పనుల్లో ఏడాదికి సగటున 20 రోజులు పని చేసిన వారిని ముందుగా గుర్తించారు. వారిలో గుంట కూడా భూమి లేని నిరుపేదలను అధికారులు వడపోసి లబ్ధిదారులుగా గుర్తించారు. వారిని ఆయా గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి ఎంపికైనట్లుగా ప్రకటించారు. ఎల్లారెడ్డి మండలంలోని 31 గ్రామాల పరిధిలో 452 మందిని ఈ పథకానికి ఎంపిక చేసిన అధికారులు వారికి ఏడాదికి 12 వేల రూపాయలు రెండు విడుతలుగా ఆరు నెలలకు ఒకసారి ఆరు వేల చొప్పున వస్తాయని చెప్పారు. రెండేండ్ల క్రితం ఎంపిక ప్రక్రియను పూర్తి చేసినప్పటికీ, ఇప్పటి వరకు మండలంలో అందింది మాత్రం కేవలం ఒకే ఒక్కరికి కావడం గమనార్హం.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలుచేసేందుకు పైలట్ గ్రామం ఎంపికలో మాయాజాలం ప్రదర్శించింది. ముందుగా ఎంపిక ప్రక్రియకు నిబంధనలు అమలు చేసింది. లబ్ధిదారుల ఎంపిక అనంతరం పైలట్ గ్రామాల పేరిట అతి తక్కువ మంది లబ్ధిదారులు ఉన్న గ్రామాలను ఎంపిక చేసింది. ఎల్లారెడ్డి మండలంలో 31 గ్రామాలు ఉండగా, ఇందులోని కొన్ని గ్రామాల్లో 50 మందికి పైగా లబ్ధిదారులు ఉండగా వాటిని పక్కన పెట్టి కేవలం ఒకే ఒక్క లబ్ధిదారు ఉన్న మల్లయ పల్లి గామాన్ని ఎంపిక చేయడం గమనార్హం. మండలంలోని మల్లయపల్లి, దాల్మల్కపల్లి, శివ్వాపూర్ గ్రామాల్లో కేవలం ఒక్కొక్కరు మాత్రమే ఉండగా మల్లయపల్లికి చెందిన భూమ పోచవ్వను ఎంపిక చేశారు. రెండేండ్ల క్రితం ఆరువేల రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద అందజేశారు. అప్పటి నుంచి ఈ పథకం కింది ఇప్పటి వరకు ఎవరికీ ఎలాంటి లబ్ధి చూకూరకపోవడం గమనార్హం.