వేల్పూర్, సెప్టెంబర్ 17: యూరి యా కోసం జిల్లా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే జిల్లా ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎక్కడని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. పెద్దపెద్ద మాటలు, అడ్డగోలుగా తిట్టే అర్వింద్ కేంద్రం నుంచి యూరియా ఎందుకు తెప్పించడంలేదని నిలదీశారు. ప్రధాని మోదీ వద్ద చాలా విలువ, పలుకుబడి ఉన్నదని చెప్పుకునే ఎంపీ రైతుల యూరియా కష్టాలపై ఎందుకు మాట్లాడడం లేదని మండిపడ్డారు.రాష్ట్ర రైతాంగానికి యూరియా అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి విఫలమయ్యాయని విమర్శించారు. బుధవారం వేముల వేల్పూర్ మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. నిజామాబాద్ జిల్లాకు 75వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమైతే 72 వేల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని అధికారులు చెబుతున్నారని, మరి వచ్చిన యూరియా ఎటు వెళ్లిందని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీలు ఎనిమిది మంది ఉన్నా ప్రయోజనం లేదని, వెంటనే మోదీ వద్దకు వెళ్లి యూరియా తీసుకురావాలని డిమాండ్ చేశారు. యూరియా కోసం రైతులు గోస పడుతుంటే యుద్ధం వల్ల యూరియా అందడంలేదని ఒక ఎంపీ సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ముందు చూపు లేక యూరియా కొరత ఏర్పడిందన్నారు. రైతులు తిరగబడితే ఎంపీలు రాజీనామా చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.
రాష్ట్రవ్యాప్తంగా యూరియా కొరతపై బీఆర్ఎస్ పార్టీ నెల రోజుల నుంచి అన్ని వేదికల ద్వారా హెచ్చరిస్తున్నా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. యూరియా కోసం సీఎం రేవంత్‌రెడ్డిని రైతులు తిడుతున్నా, శాపనార్థాలు పెడుతున్నా కనిపించడంలేదని మండిపడ్డారు. యూరియా కోసం రైతులు నిద్రాహారాలు మాని గోదాముల వద్ద గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. యూరియా కోసం చెప్పులు, పాస్‌పుస్తకాలు వరుసలో పెట్టే పరిస్థితి మళ్లీ దాపురించిందన్నారు. బాల్కొండ మండలంలో వంద సంచుల యూరియా రాగా.. పది గ్రామాలకు ఎన్ని ఇస్తారని ప్రశ్నించారు. మెండోరా, వేల్పూ ర్ మండలాల్లో వెయ్యి బస్తాల యూరియా అవసరం ఉంటే కేవలం 90 బస్తాలు వచ్చాయని ఇవి ఎవరికి ఇస్తారని నిలదీశారు. మోర్తాడ్ మండలం దోన్పాల్ గ్రామంలో పోలీసులను పెట్టి టోకెన్లు పంపిణీ చేసే దౌర్భాగ్యం ఏర్పడిందన్నారు. రైతుల అవసరం మేరకు ఎంత కావాలో ముందుగానే కేంద్రానికి లెక్కలు పంపించాలని, కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయంలేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే రాష్ట్రంలోని కాంగ్రెస్, బీజేపీకి చెందిన 16 మంది ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రైతులు స్టాక్ పెట్టుకుంటున్నారని కాంగ్రెస్ నేతలు, అధికారులు అంటున్నారని, రైతు ఏమైనా యూరియా తింటాడా? అని నిలదీశారు. తప్పుడు లెక్కలు చెబుతూ, యూరియా సరఫరా చేసే సత్తా లేక, తెప్పించే తెలివిలేక కాంగ్రెస్,బీజేపీ ఎంపీలకు అవగాహన లేక రైతులు రోడ్డుపైన పడ్డారని అన్నారు. ప్రజలకు ఉపయోగపడని వారికి పదువులు ఎందుకని, రైతులకు బస్తా యూరియా కూడా ఇవ్వలేని అసమర్థ ఎంపీలు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని వేముల డిమాం డ్ చేశారు. వారు పదవుల్లో ఉండడానికి అర్హత లేదన్నారు.
కేసీఆర్ ప్రభుత్వంలో ఏనాడు యూరియా కొరత లేదని గుర్తుచేశారు. కేసీఆర్ పాలన రైతులకు స్వర్ణ యుగంగా విలసిల్లిందన్నారు. ముందుగానే లెక్కలు వేసి కేంద్రానికి మంత్రుల బృందాన్ని పంపించి యూరియా తెప్పించే వారని తెలిపారు. ఎక్కడ కూడా రైతులు క్యూలో నిల్చున్న దాఖలాలు లేవని తెలిపారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల కన్వీనర్లు పుర్ణానందం, నాగధర్, దొన్కంటి నర్సయ్య, మాజీ ఎంపీపీ ఆర్మూర్ మహేశ్, మాజీ జడ్పీటీసీ చౌట్పల్లి రవి, దోళ్ల రాజేశ్వర్‌రెడ్డి, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.