రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిధ్యం కరువైంది. దీంతో ఎక్కడి సమస్యలు అక్కడే తిష్టవేయగా.. పాలన వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. పలు ప్రభుత్వ శాఖల్లో సమన్వయం కొరవడి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రి పదవి లోటుతో జిల్లాలో అన్నింటికీ ఇన్చార్జి మంత్రి దిక్కుగా మారారు.
మహబూబ్‌నగర్‌కు చెందిన ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించగా.. పది నెలల్లో చుట్టపు చూపుగా వచ్చి వెళ్లారు. ఉమ్మడి జిల్లా ప్రభుత్వ యంత్రాంగానికి ఇన్చార్జి మంత్రిగా ఆయన దిశా నిర్దేశం చేసింది శూన్యం. మూడుసార్లు ఇలావచ్చి అలా వెళ్లి మమ అనిపించారు తప్ప, యంత్రాంగంపై ఇప్పటి వరకూ పట్టు సాధించలేదు. ఏ ఒక్క అంశపైనా సమీక్ష నిర్వహించలేదు సరికదా.. కనీసం సలహాలు, సూచనలు ఇచ్చిన దాఖలాలు లేకపోవడం గమనార్హం.
-నిజామాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మంత్రి కాని మంత్రి హోదాలో ఎమ్మెల్యేలు అధికార దర్పాన్ని చెలాయిస్తూ దూసుకు పోతున్నారు. దీంతో యంత్రాంగంలో అయోమయం ఏర్పడింది. ఎవరి మాట వినాలో, ఎవరి ఆదేశాలు పాటించాలో తెలియక అధికా రులు తలలు పట్టుకుంటున్నారు. ఎలాంటి ముప్పును ఎదుర్కోవాల్సి వస్తుందోనని ప్రభుత్వ ఉద్యోగులంతా మిన్నకుండి పోతున్నారు. ప్రజాపాలనలో గందరగోళం చోటు చేసుకుంటున్న నేపథ్యంలో జూపల్లి కృష్ణారావు సుదీర్ఘ విరామం తర్వాత నిజామాబాద్ జిల్లా నేడు వస్తున్నారు. ఆర్మూర్, భీమ్‌గల్, మోర్తాడ్ పట్టణాల్లో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖకు చెందిన నూతన భవనాన్ని ప్రారంభించేందుకు ఇన్చార్జి మంత్రి రాక సందర్భంగా పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఆబ్కారీ శాఖ మంత్రి హోదాలోనే కాకుండా ఇన్చార్జి మంత్రిగానూ జూపల్లి పర్యటన ప్రా ధాన్యం సంతరించుకున్నది.
మంత్రి బాధ్యత వహిస్తున్న ఎక్సైజ్ శాఖలో తీవ్ర అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కల్లు డిపోల నిర్వాహకులతో అంటకాగుతూ ప్రజల ప్రాణాలను తోడేస్తున్నవైనం బహిరంగంగానే కొనసాగుతోంది. కొంతమంది ఉద్యోగుల్లో సత్ప్రవర్తన కొరవడింది. దీంతో నిజామాబాద్ జిల్లాలో ఏటా ఎవరో ఒకరు ఎక్సైజ్ ఉద్యోగి తీరుతో ఈ శాఖ పరువు పోతోంది. క్రమశిక్షణకు మారుపేరుగా ఉండాల్సిన యూనిఫార్మ్ సర్వీసులో ఈ రకమైన పరిస్థితిని దారిలోకి తెచ్చేందుకు ఆబ్కారీ మంత్రి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై ఆసక్తిగా నెలకొన్నది. తాజాగా వెలుగు చూసిన పరిణామాలపై ఇప్పటికే జూపల్లి కృష్ణారావు తీవ్ర స్థాయిలో కోపంతో ఉన్నట్లుగా తెలిసింది.
మాక్లూర్ ఐఎంఎల్ డిపోలో వసూళ్ల దందా ఎక్కడా లేని విధంగా జరుగుతుండడంపైనా చర్చ జరుగుతోంది. లోడింగ్, అన్లోడింగ్ విషయంలో పైసా వసూళ్లపై వైన్‌షాపు ఓనర్లంతా ఏకమై ఫిర్యాదు చేయడంతో పరిస్థితి రచ్చకెక్కింది. మరోవైపు వైన్ షాపులపై ఎక్సైజ్ శాఖ నిఘా అంతంత మాత్రంగానే ఉన్నట్లు ఆరోపణలున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా బెల్టు షాపులు కోకొల్లలుగా విస్తరిస్తున్నాయి. బంద్ సమయంలో వైన్ షాపుల్లోని సరుకు పెద్ద మొత్తంలో పక్కదారి పడుతోంది. అక్రమంగా డబుల్ ధరలకు అమ్ముకుని రెట్టింపు లాభాలకు వ్యాపారులు రుచి మరుగుతున్నారు. ఈ అక్రమ పద్ధతులకు శాఖలోని కొంత మంది సహకారం అందిస్తుండడంతో సామాన్యులు చితికి పోతున్నారు.
మోర్తాడ్, భీమ్‌గల్, ఆర్మూర్‌లోని ఎక్సైజ్ నూతన భవనాలను బిల్డింగ్‌లను ఆబ్కారీ మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం ప్రారంభించనున్నారు.అయితే ఈ నిర్మాణాలను గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే చేపట్టారు. కేసీఆర్ హయాంలోనే ఎక్సైజ్‌కు జవసత్వాలు కల్పించబడ్డాయి. నిధులు కూడా విడుదల చేయడంతో అసెంబ్లీ ఎన్నికల నాటికి పూర్తి స్థాయిలో నిర్మాణాలు జరిగాయి. పది నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తుది మెరుగులు మాత్రమే దిద్దింది. కేసీఆర్ హయాంలో జరిగిన కృషికి కాంగ్రెస్ హయాంలో ప్రారంభోత్సవాలు జరుపుకుంటుండడంపై సంబంధిత శాఖలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. గత సర్కారు ఆబ్కారీ శాఖకు పెద్ద పీట వేసిన పరిస్థితిపైనా చర్చ జరుగుతోంది.
పంట రుణమాఫీ విషయంలో ప్రభుత్వ తీరుపై రైతుల్లో ఆగ్రహం గూడు కట్టుకున్నది. రూ.2లక్షలోపు పంట రుణాలను రద్దు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ అమలుకాకపోవడంతో అన్నదాతలు నిజామాబాద్, కామారెడ్డిలో ఎదురు చూస్తున్నారు. వీరికి భరోసా ఇచ్చే నాథుడే కరువయ్యాడు. నిజామాబాద్ వ్యవసాయ శాఖలో ఆధిపత్య పోరుతో ఆ శాఖ పనితీరు సక్రమంగా లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యోగుల మధ్య సఖ్యత లేకపోవడంతో రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు.
రుణమాఫీ విషయంలో రైతులకు సమాధానాలు ఇవ్వడంలోనూ వ్యవసాయ శాఖ విఫలమైందనే ఆరోపణలున్నాయి. క్షేత్ర స్థాయిలో ఏఈవోలు అందుబాటులో ఉండడం లేదు. వీరిపై డీఏవో పర్యవేక్షణ కరువైంది. వ్యవసాయ శాఖలో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ధాన్యం సేకరణ భారీ సవాల్‌తో కూడుకుతున్నది. వానకాలం వరి సాగు ముగింపునకు చేరుకోగా కొన్ని చోట్ల పంట చేతికి వస్తోంది. ఈ దశలో వడ్ల కొనుగోళ్లపై యంత్రాంగానికి దిశా నిర్దేశం చేసే వారు కరువయ్యారు.
జూపల్లి కృష్ణారావు తన పర్యటనలో సాయంత్రం యంత్రాంగంతో సమీక్ష నిర్వహించనున్నారు. ఇందులో వడ్ల కొనుగోళ్లపై సమీక్ష ఉంటుందా? లేదా? అనే విషయంపై స్పష్టత లేదు. ప్రజాపాలనలో తొమ్మిది నెలల క్రితం వివిధ పథకాలకు దరఖాస్తు చేసుకున్న ప్రజలకు, మహాలక్ష్మి కింద ఉచిత గ్యాస్ సిలిండర్, గృహ జ్యోతి కింద 200 యూనిట్ల కరెంట్ పథకం అమలు కావడం లేదు. దీంతో సామాన్యులు ఆగమాగం అవుతున్నారు. ఆయా పథకాలకు అర్హులైన వారంతా తమను ఆదుకోవాలంటూ ప్రజావాణిలో ప్రతి సోమవారం ఫిర్యాదులు చేస్తున్నా.. వాటికి సమాధానం రావడం లేదు.
ఆబ్కారీ, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఉదయమే హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో మోర్తాడ్‌కు చేరుకుంటారు. ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించి భీమ్‌గల్‌కు చేరుకుని ఎక్సైజ్ భవనంతోపాటు పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి ఆర్మూర్‌కు చేరుకుని ఎక్సైజ్ నూతన బిల్డింగ్‌ను ప్రారంభిస్తారు. ఆర్మూర్ నుంచి నిజామాబాద్ కలెక్టరేట్‌కు చేరుకుని సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించున్నారు. అనంతరం హైదరాబాద్‌కు రోడ్డు మార్గంలో వెళ్లనున్నారని అధికారులు పేర్కొన్నారు.