నిజామాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కొన్నిరోజులుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వడ్డీ వ్యాపారుల ఆగడాలకు అడ్డూ అదుపులేకుండా పోతున్నది. కోట్ల రూపాయల్లో వడ్డీ వ్యాపారం నిర్వహిస్తూ, సామాన్యుల నడ్డి విరుస్తున్నారు. సామాన్యుల బలహీనతలను ఆసరాగా చేసుకొని సొమ్ము చేసుకుంటున్నారు. అప్పులిచ్చి అక్రమంగా అధిక వడ్డీలు వసూలు చేస్తూ అమాయకులను నిండా ముంచుతున్నారు. చాలా మంది తమ అవసరాల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకొని వారు అధిక వడ్డీలకు అప్పులు ఇస్తున్నారు. కొంత మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా వడ్డీ వ్యాపారుల అవతారమెత్తారు. పేరుకు రియల్ ఎస్టేట్ కంపెనీ అని బయట బోర్డులు ఏర్పాటు చేసినా, లోపల మాత్రం ఫక్తు ఫైనాన్స్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. గతంలో కేవలం పట్టణాలకు మాత్రమే పరిమితమైన ఫైనాన్స్ వ్యాపారులు, నేడు గ్రామాల వరకు విస్తరించారు. రోజువారి కూలీలు, చిరువ్యాపారులను ఎంచుకొని తమ వడ్డీ వ్యాపారాన్ని మూడు పువ్వులు..ఆరుకాయలుగా మార్చుకుంటున్నారు.రోజువారీగా, వారం రోజులకొకసారి ఇచ్చిన అప్పులను వసూలు చేస్తూ అమాయకుల నడ్డి విరుస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండడం గమనార్హం.
ఉమ్మడి జిల్లాలో రిజిస్ట్రేషన్ లేకుండానే ఫైనాన్స్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. అక్రమంగా వ్యాపారం చేస్తూ అమాయకులను దోచుకుంటున్నారు. కొందరు పనులు లేక, చేసిన అప్పులు తీర్చడానికి, కొందరు కుటుంబ పోషణ కోసం, మరి కొందరు తమ వ్యాపార నిర్వహణకు సకాలంలో అప్పులు దొరక్క వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా భావించిన వ్యాపారులు అధిక వడ్డీలకు డబ్బులు ఇచ్చి వారి నడ్డి విరుస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ వడ్డీ వ్యాపారుల చేతుల్లో నలిగిపోతున్నారు. గతంలో అనేక మైక్రో పైనాన్స్ కంపెనీలు ఏజెంట్ల ద్వారా గ్రామాల్లో విచ్చలవిడిగా రుణాలు ఇచ్చాయి. రుణాల వసూలుకు కంపెనీ ప్రతినిధులు.. ప్రజలను వేధింపులకు గురి చేయడంతో ప్రభుత్వం మైక్రో ఫైనాన్స్లపై ఉక్కుపాదం మోపింది. ప్రస్తుతం గుట్టు చప్పుడు కాకుండా చాప కింద నీరులా ఈ దందా కొనసాగుతుండడం గమనార్హం. పట్టణాలు, గ్రామాల్లో ఫైనాన్స్ వ్యాపారులు యథేచ్ఛగా వ్యాపారం నిర్వహిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ పైనాన్స్ దందాకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు.
వడ్డీ వ్యాపారుల వేధింపులు నిత్యం ఎక్కడో ఓచోట వెలుగు చూస్తూనే ఉంటున్నాయి. ఠాణా మెట్లు ఎక్కిన సందర్భాల్లోనే పోలీసులు పట్టించుకుంటున్నారు. లేదంటే ఉన్నతాధికారుల ఆదేశాలతో దాడులు చేసి మూడు,నాలుగు రోజు లు హల్ చల్ చేస్తున్నారు. నిరంతర నిఘా లోపించడంతో ఫైనాన్స్ వ్యాపారుల ఆగడాలు మితిమీరుతున్నాయి. పోలీసులు నిరంతరం నిఘా పెడితే పేదలకు మేలు జరిగే ఆస్కారం ఉంటుంది. అవసరానికి డబ్బులు ఇవ్వడం ఓ విధంగా సాయం చేయడమే అయినప్పటికీ వడ్డీపై వడ్డీలు వేసి చక్ర వడ్డీలు వసూళ్లు చేస్తూ ‘పైసా’చికత్వాన్ని పొందుతున్న వ్యాపారుల చేతుల్లో ప్రజలు విలవిల్లాడుతున్నారు.
వడ్డీ వ్యాపారులు అప్పు ఇచ్చే మొత్తం నగదులో కొంతమొత్తంగా ముందుగానే తీసుకుని మిగితావి రుణ గ్రహీతలకు ఇస్తున్నారు.రూ.10వేలు అప్పు తీసుకుంటే రూ.9వేలు మాత్రమే ఇస్తారు. దీనికి అప్పుతీసుకున్నవారు రోజుకు రూ.100 చొప్పున 100 రోజులు చెల్లించాల్సి ఉంటుంది. నిర్ణీత గడువులోగా అప్పు చెల్లించకపోతే పెనాల్టీ వసూలు చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నారు. వారం లేదా రోజు వారి పద్ధతిలో చెల్లించేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు. తప్పనిపరిస్థితుల్లో కొందరు వ్యాపారుల నుంచి అధిక వడ్డీకి అప్పులు తీసుకుంటూ అప్పుల ఊబిలో చిక్కుకుపోతున్నారు. వ్యాపారులు రూ. వందకు రూ.5 నుంచి రూ.10 వరకు వడ్డీ వసూలు చేస్తూ రూ.లక్షల్లో దోచుకుంటున్నారు. అధిక వడ్డీతో పాటు డాక్యుమెంటేషన్ చార్జీలు కూడా అప్పుతీసుకునేవారిపై రుద్దుతున్నారు.
నిజామాబాద్ జిల్లాలో ఓ జాతీయ పార్టీకి చెందిన గల్లీ లీడర్ ఇదే విధంగా వేధింపులకు గురి చేయడంతో కుటుంబం సహా కృష్ణా నదిలో మునిగి తనువు చాలించారు. గతేడాది న్యాల్కల్ రోడ్డులో ఓ గుట్కా వ్యాపారి విషయంలోనూ ఇదే తరహా వేధింపులతో కుటుంబం బలైంది. పెళ్లీడుకు వచ్చిన బిడ్డపైనా ఫైనాన్స్ అక్రమార్కులు నోటికొచ్చినట్లుగా మాట్లాడడంతో తట్టుకోలేక ప్రాణాలు తీసుకున్నారు. కామారెడ్డిలో ఈ మధ్య కాలంలోనే ఫైనాన్స్ వ్యాపారుల వేధింపులు భరించలేక పలువురు ఆత్మహత్యలు చేసుకున్నారు. రియల్ ఎస్టేట్ దుకాణాల ముసుగు వేసుకుని కామారెడ్డి జిల్లా కేంద్రంలో కొద్ది మంది అక్రమంగా ఆర్థిక లావాదేవీలు నడుపుతున్నారు. పేరుకు రియల్ ఎస్టేట్ వ్యాపారం కనిపిస్తున్నప్పటికీ తెరచాటున ఫైనాన్స్ దందా నడుస్తున్నది. లోతుగా పోలీసులు దర్యాప్తు చేస్తే అక్రమార్కులు చాలా మంది బహిర్గతమవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కామారెడ్డి నియోజకవర్గంలోని చుట్టు పక్కల ప్రాంతాల్లో బంగారం కుదువ పెట్టుకుని డబ్బులు ఇస్తున్న వారు కూడా ఉన్నారు. కిలోల కొద్ది బంగారాన్ని పోగేసుకుని జల్సాలు చేస్తున్న దుండగులు సైతం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతున్నది.