మోర్తాడ్, ఫిబ్రవరి 12: పేదలకు అందాల్సిన పీడీఎస్ బియాన్ని కొందరు అక్రమార్కులు పక్కదారి పట్టిస్తున్నారు. జిల్లాలో గుట్టుగా సేకరించిన పీడీఎస్ బియ్యాన్ని రాష్ట్ర సరిహద్దులు దాటించి అందిన కాడికి దోచుకుంటున్నారు. కమ్మర్పల్లి మండలం గాంధీనగర్ కేంద్రంగా ఓ వ్యక్తి పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు స్థానికుల నుంచి ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి. అధికారులను మచ్చిక చేసుకొని గాంధీనగర్ నుంచి పీడీఎస్ బియ్యాన్ని మహారాష్ట్రకు తరలిస్తుస్తున్నా, సదరు వ్యక్తిపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా, అధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గాంధీనగర్ కేంద్రంగా పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడంలేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇందుకు మండల, జిల్లా స్థాయి నుంచి చెక్‌పోస్టు అధికారులకు ఠంఛన్‌గా నెలనెలా మామూళ్లు ముట్టడమే కారణమనే సమాధానం వస్తున్నది. పెద్దమొత్తంలో బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నా అధికారులు మాత్రం తమకు ఏమీ తెలియనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
గాంధీనగర్‌కు చెందిన ఓ వ్యక్తి పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేయడంలో ఆరితేరాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఏండ్ల తరబడి ఈ దందాను చేస్తూ కోటీశ్వరుడయ్యాడంటే అతిశయోక్తి కాదన్నారు. సదరు వ్యక్తి పీడీఎస్ బియ్యాన్ని సేకరించేందుకు 20 మందిని నియమించుకున్నాడని, వారందరికీ పాత టీవీఎస్ చాంప్‌లు, బియ్యం తూకం వేసేందుకు త్రాసులు కొనిచ్చాడని తెలిపారు. బియ్యం సేకరించి తీసుకువచ్చిన వారికి బియ్యాన్ని బట్టి కమీషన్ చెల్లిస్తాడని, వీరంతా ప్రజల నుంచి పదిరూపాలయకు కిలో బియ్యాన్ని కొనుగోలు చేస్తారన్నారు. ఇదే కాకుండా రేషన్‌డీలర్ల నుంచి కూడా డైరెక్ట్‌గా బియ్యాన్ని కొనుగోలు చేస్తాడని తెలిపారు. మన జిల్లాతోపాటు పక్క జిల్లాల్లో కూడా బియ్యాన్ని సేకరించడం గమనార్హం. ప్రతినెలా సేకరించిన బియ్యాన్ని టన్నులకొద్ది లారీల్లో రాష్ర్టాన్ని దాటించి అక్కడ ఎక్కువ ధరకు విక్రయిస్తారని సమాచారం.
పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తి జిల్లాలోని చాలా మంది అధికారులకు మామూళ్లు ముట్టుజెప్పుతున్నట్లు తెలిసింది. ఒకవేళ బియ్యాన్ని పట్టుకున్నా కేసులు నమోదు చేయని సందర్భాలు ఉన్నట్లు సమాచారం. పట్టుకునేందుకు వచ్చిన అధికారులకు వెంటనే పైఅధికారుల నుంచి ఫోన్ రావడంతో కేసును మధ్యలోనే వదిలేస్తున్నారనే చర్చ ప్రజల్లో జోరుగా వినిపిస్తున్నది. తనకు అధికారుల నుంచి అందిన సమాచారం మేరకు బియ్యం నిల్వ చేసే ప్రాంతాలను మారుస్తూ ఉంటాడని స్థానికుల నుంచి వచ్చిన సమాచారం. చెక్‌పోస్టు వద్దకూడా ఇప్పటి వరకు సదరు వ్యక్తికి సంబంధించిన బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వాహనాలు పట్టుబడలేవంటే పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాకు బ్రేక్ వేయాలని ప్రజలు కోరుతున్నారు.
కమ్మర్పల్లి గ్రామశివారులోని గాంధీనగర్‌లో లక్ష్మణ్ అనే వ్యక్తి ఇంట్లో నిల్వచేసిన పీడీఎస్ బియ్యాన్ని (5.20క్వింటాళ్లు) పట్టుకున్నట్లు ఆర్ఐ శరత్‌కుమార్ తెలిపారు. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు లక్ష్మణ్ ఇంట్లో సోదాలు నిర్వహించగా ఏడు బస్తాల బియ్యం దొరికాయని పేర్కొన్నారు. వాటిని సీజ్ చేసి పంచనామా నిర్వహించి భద్రత నిమిత్తం వెంకటేశ్వర రైస్‌మిల్‌కు తరలించినట్లు ఆర్ఐ చెప్పారు.
పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా నేరం. గాంధీనగర్‌లో పీడీఎస్ బియ్యం నిల్వలు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో పట్టుకున్నాం. ఎవరైనా పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేసినా, నిల్వ ఉంచినా అధికారులకు సమాచారం అందించాలి.
– శరత్‌కుమార్, ఆర్ఐ, కమ్మర్పల్లి