ఉమ్మడి జిల్లాలోని మంజీరా పరీవాహక ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణా ఆగడంలేదు. బరితెగించిన ఇసుకాసురులు యథేచ్ఛగా తవ్వకాలు చేపడుతున్నారు. మంజీరా పరీవాహక ప్రాంతంలో అధికారిక ఇసుక క్వారీలను మూసివేశారు. జ్యుడీషియల్ విచారణలో భాగంగా టీజీఎండీసీ ఆధ్వర్యంలో నడిచే క్వారీలను బంద్ పెట్టారు. కొన్నాళ్ల పాటు ఇసుక తవ్వకాలను బంద్ చేసినట్లు చూపినా.. స్థానికంగా జోరుగా ఇసుక రవాణా జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇంతవరకు అధికారికంగా ఇసుక తవ్వకాలు చేపట్టలేదు. ఇసుక క్వారీలకు అనుమతులు మంజూరు చేయలేదు. ఉన్న అనుమతులు రద్దు చేసి జీరో దందాకు తెర లేపింది. పారదర్శకత పేరుతో విచారణ కొనసాగుతున్నప్పటికీ అక్రమాలకు మాత్రం అడ్డూ అదుపు లేకుండా పోతున్నది.
– నిజామాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
పోలీసులకు, రెవెన్యూ అధికారులకు మామూళ్ల ఆశ చూపి అక్రమార్కులు ఇదంతా చేస్తున్నారన్న విమర్శలు గుప్పు మంటున్నాయి. అడ్డు వచ్చిన గ్రామస్తులపై బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఇసుక అక్రమ రవాణాకు నియోజకవర్గాల్లో కీలక నేతల అండదండలు పుష్కలంగా ఉన్నాయి. గత ఎన్నికల్లో సహకరించిన తమ అనుచరులకు మేలు చేసేందుకు మద్దతుగా నిలిచి ఇసుక దందాను ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం.
అడ్డు వచ్చే పోలీసులకు ఆమ్యామ్యాలను ముట్టజెప్పి పక్కకు తప్పిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాత్రుల్లో ట్రాక్టర్లు, టిప్పర్ల రాకపోకలు సాగిస్తున్నా.. పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. మామూళ్లు ఇవ్వని లారీలు, ట్రాక్టర్లను స్టేషన్లకు తరలించి చిన్నపాటి కేసులతో మమ అనిపిస్తున్నారు. యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నప్పటికీ పోలీస్ ఉన్నతాధికారులు సైతం మిన్నకుండి పోతుండడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎస్సై, సీఐ స్థాయి అధికారులైతే మంజీరా నది పరీవాహకంలో బరితెగించి ప్రవర్తిస్తున్నట్లుగా సమాచారం.
మంజీరా ఇసుక రవాణాను నియంత్రించేందుకు కొద్ది రోజుల క్రితం వీఆర్ఏలను తనిఖీలకు నియమించగా అక్రమార్కుల బెదిరింపులకు భయపడి వారంతా ఆఫీస్ డ్యూటీలకే పరిమితమవుతున్నారు. రెవెన్యూ అధికారులకు ఇదంతా తెలిసినప్పటికీ ఏమీ చేయలేక చేతులు ఎత్తేస్తున్నారు. పెద్దల ‘హస్తం’ ఉండగా తామేం చేయగలమంటూ రెవెన్యూ ఉన్నతాధికారులు సైతం చేతులు ఎత్తేసినట్లుగా ప్రచారం జరుగుతున్నది. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోకుండా నేతలతో అంటకాగి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడంలో పోలీస్ శాఖ నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నది.
అనధికారికంగా ఇసుక రవాణాతో పెద్దమొత్తంలో ప్రభుత్వ ఆదాయానికి నష్టం వాటిల్లుతున్నది. అధికారిక క్వారీల్లో ఇసుక తవ్వకాలు చేపట్టాలంటే సీనరేజీ చార్జీల పేరుతో ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. ఇప్పుడు ఇదంతా బంద్ కావడంతో అంతా అనధికారికంగానే కొనసాగడం గమనార్హం. చీకటి పడితేచాలు అక్రమార్కులకు పండుగలా మారిందని పరీవాహక ప్రాంత ప్రజలు చెబుతున్నారు. ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలించి లారీల్లోకి ఎక్కించి వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం. మహారాష్ట్ర, కర్ణాటక, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు తరలించి అందినకాడికి జేబులు నింపుకొంటున్నారు.
బిచ్కుంద మండలంలోని హస్గుల్, షెట్లూర్, ఖత్గావ్, పుల్కల్ గ్రామ శివారుల్లోని మంజీరా పరీవాహక ప్రాంతాల నుంచి పదుల సంఖ్యలో ట్రాక్టర్లు నడుస్తున్నాయి. గ్రామస్తుల పేరిట తెరవెనుక బడా వ్యాపారులు రంగంలోకి దిగి ఇదంతా చేస్తున్నారని తెలుస్తోంది. పేరుకు స్థానిక అవసరాలు, గ్రామస్తులను ముందుకుతోసి వ్యాపారులు పెద్దమొత్తంలో దండుకుంటున్నట్లు ప్రచారం జరుగుతున్నది. మద్నూర్ మండలం సుల్తాన్పేట్, రుషేగావ్ శివారుల్లో ఇసుకను డంప్ చేసి అక్కడి నుంచి మహారాష్ట్ర, కర్ణాటకకు రాత్రివేళ టిప్పర్ల ద్వారా తరలిస్తున్నట్లుగా తెలుస్తున్నది. పరీవాహక ప్రాంతాల్లో ఒక్కో గ్రామంలో 50 వరకు ట్రాక్టర్లు ఉన్నట్లు అంచనా. వాటి ద్వారా ఇసుకను సులువుగా నదీ మార్గాన్ని దాటించి ఇతర రాష్ర్టాలకు గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్నారు.
కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లోని మంజీరా నది పరీవాహక ప్రాంతాల్లో పేరుకు పోయిన ఇసుకను అక్రమార్కులు యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. ఇందుకు స్థానిక ప్రజాప్రతినిధులు బహిరంగంగానే సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కామారెడ్డి జిల్లా జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాల్లో స్థానిక కీలక నేతల అండదండలతో బిచ్కుంద, బీర్కూర్ మండలాల్లో ఇసుక తవ్వకాలు జోరుగా కొనసాగుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలోనూ బాన్సువాడ నియోజకవర్గం పోతంగల్ మండలంలోని మంజీరా పరీవాహకంలో అక్రమంగా ఇసుకను తోడేస్తున్నారు.