నస్రుల్లాబాద్, ఏప్రిల్ 11: ఇసుక అక్రమ రవాణాకు అధికారులు చెక్‌పెట్టారు. బీర్కూర్ మండల కేంద్రంలో మంజీరా బ్రిడ్జి కింది నుంచి ఇసుకను అక్రమంగా తరలించడానికి ఇసుకాసురులు ఏర్పాటు చేసుకున్న దారిని మూసివేయించారు. బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి గురువారం సాయం త్రం డోంగ్లి మండలం నుంచి బీర్కూర్‌కు వెళ్తుండగా బీర్కూర్ బ్రిడ్జి కింద మంజీరా నదిలో కుర్ల శివారులో అక్రమంగా రెండు ట్రాక్టర్లలో ఇసుకను నింపడాన్ని గమనించారు.
వెంటనే వాటిని పట్టుకోవడానికి ప్రయత్నించగా డ్రైవర్లు ట్రాక్టర్లను అక్కడే వదిలి పారిపోయారు. దీంతో సబ్ కలెక్టర్ కిరణ్మయి, బీర్కూర్, డోంగ్లి మండలాల తహసీల్దార్లు, ఆర్ఐలు, పోలీసుల సమక్షంలో ఇసుక రవాణాకు వినియోగిస్తున్న దారిని శుక్రవారం తొలగింపజేశారు. ఇసుక అక్రమ రవాణా అరికట్టాలని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు చేపట్టినట్లు సబ్ కలెక్టర్ తెలిపారు.