మోర్తాడ్, డిసెంబర్ 29: మండలంలోని గాండ్లపేట్ పెద్దవాగు నుంచి కొన్నిరోజులుగా ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది. దీనిపై ఎన్ని ఫిర్యాదులు, పత్రికల్లో కథనాలు వచ్చినా అధికారుల్లో స్పందన కరువైంది. తూతూ మంత్రంగా చర్యలు చేపట్టి చేతులు దులుపుకున్నారు. అధికార పార్టీ నాయకులకు అధికారులు వంతపాడడంతో ఇసుక దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఇసుక అక్రమ రవాణాపై జిల్లావ్యాప్తంగా చర్చ జరుగుతున్నా.. తగ్గేదేలే అన్నట్లుగా ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు.
ఇసుక అక్రమ రవాణాపై పత్రికల్లో కథనాలు వస్తుండగా.. ‘ట్రాక్టర్లు పట్టుకున్నాం, డంప్‌లు సీజ్ చేశాం’ అంటూ అధికారులు ప్రకటనలకే పరిమితమయ్యారనే విమర్శులు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల సహకారంతో అధికార పార్టీ నాయకులు ‘మేమవరికీ వినం’ అనే రీతిలో వ్యవహరిస్తున్నారు. నెల రోజులుగా గాండ్లపేట్ పెద్దవాగులో కేవలం జేసీబీ ద్వారానే ఇసుకను తవ్వేస్తున్నా.. అధికారులకు మాత్రం జేసీబీ కనిపించకపోవడం గమనార్హం. ఆదివారం పట్టపగలే జేసీబీతో గాండ్లపేట్ పెద్దవాగులో ఇసుక తవ్వకాలు చేపట్టారంటే పరిస్థితి ఎంతవరకు వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. అధికారుల సూచనల మేరకు వాగులోకి జేసీబీలు దిగడం, బయటికి వస్తున్నాయనే విషయం స్పష్టమవుతున్నది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.