ఇసుక అక్రమ తవ్వకాలకు బాల్కొండ నియోజకవర్గం అడ్డాగా మారింది. కొన్నాళ్లుగా నిలిచిపోయిన ఇసుక దందా మళ్లీ మొదలైంది. బుధవారం గోన్‌గొప్పుల ప్రభుత్వ పాఠశాల వెనుక ఉన్న ఖాళీ స్థలంలో వందకు పైగా ట్రాక్టర్ల ఇసుక డంప్‌లు ప్రత్యక్షం కావడం గమనార్హం. అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే ఈ డంప్‌లు వెలిసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. దీనిపై రెవెన్యూ, మైనింగ్ అధికారులకు, జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. అలాగే, పోలీసులకు కాల్ చేసినా స్పందన లేదని గ్రామస్తులు చెబుతున్నారు.
– భీమ్‌గల్, జనవరి 8
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇసుక దందాకు అడ్డే లేకుండా పోయింది. కప్పల వాగును ఆదాయ వనరుగా మార్చుకున్న అధికార పార్టీ నేతలు ఇసుక తవ్వకాలకు పాల్పడుతున్నారు. అర్ధరాత్రి వేళ వందల కొద్దీ ట్రిప్పుల్లో ఇసుకను తరలించి డంప్ చేస్తున్నారు. అక్కడి నుంచి ఇతర ప్రాంతాల్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. నియోజకవర్గ ఇన్చార్జి ఆదేశాలతో కొనసాగుతున్న ఈ దందాను అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం ఎక్కడా అడ్డు చెప్పడం లేదు.
ఇసుక అక్రమ రవాణాకు కొందరు అధికారులు సహకరిస్తున్నారనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇసుక దందాపై ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలతో కొద్ది రోజులు గా తవ్వకాలు నిలిచి పోయాయి. మళ్లీ ఏమైందో ఏమో కానీ రెండ్రోజుల నుం చి కప్పలవాగులో తవ్వకాలు మొదలయ్యా యి. బుధవారం గోన్గొప్పులలోని ప్రభుత్వ పాఠశాల వెనుక ఉన్న ఖాళీ స్థలంలో వందకు పైగా ట్రిప్పుల ఇసుక డంప్ ప్రత్యక్షమైంది.
అధికార పార్టీ నేతల ఆగడాలతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నది. గతంలో ఇండ్ల నిర్మాణాలకు ఇసుక కావాలంటే ప్రభుత్వానికి చలానాలు కట్టే వారు. ప్రభుత్వ అనుమతి ఉన్న క్వారీల నుంచి ఇండ్ల యజమానులకు ఇసుక తరలించే వారు. అయితే, కాంగ్రెస్ గద్దెనెక్కాక అక్రమ దందా మొదలైంది. అర్ధరాత్రిలో ఇసుక తవ్వకాలు చేపట్టి, ఒకచోట డంప్ చేస్తున్నారు. ఇండ్లు నిర్మించుకునే వారికి అవసరమైన ఇసుకను విక్రయిస్తూ సర్కారు ఆదాయానికి గండి కొడుతూ తమ జేబులు నింపుకుకొంటున్నారు.