ఇసుక అక్రమ రవాణాకు అడ్డూ అదుపూ లేకుండా పోతున్నది. ఇసుక దోపిడీని అడ్డుకునేందుకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. ఇసుకాసురులు లెక్కచేయడంలేదు. ఉమ్మడి జిల్లాలో వాగులు, వంకలు, కుంటల నుంచి నదీ పరీవాహక ప్రాంతాల వరకు ఇసుకను తోడేస్తున్నారు. ఎలాంటి అనుమతులూ లేకుండా యథేచ్ఛగా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. ఈ అక్రమ దందా వెనుక అధికార పార్టీ నేతల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతుండగా.. పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
-నిజామాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఇసుకాసురులతో చేతులు కలిపిన 12మంది పోలీసులపై చర్యలకు సిఫార్సు చేసినప్పటికీ, ఎక్కడా మార్పు కనిపించకపోవడం గమనార్హం. కొంద రు పోలీసులపై బదిలీ వేటు వేసి నా వారిలో మార్పు కానరావడంలేదు. ఇసుక అక్రమ రవాణాపై ఉన్నతాధికారుల నుంచి కూడా స్పందన కరువైంది. నిజామాబాద్‌కు సీపీ లేకపోవడంతో కామారెడ్డి ఎస్పీ సింధూశర్మకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ఆమె సీపీ హోదాలో ఉన్నప్పటికీ కింది స్థాయిలో అక్రమాల వ్యవహారాలకు ఎక్కడా చెక్ పడడం లేదు. కామారెడ్డి జిల్లాలోని మంజీరా పరీవాహక ప్రాంతంతోపాటు నిజామాబాద్ జిల్లా బోధన్, బాన్సువాడ, బాల్కొండ నియోజకవర్గాల్లో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది. అడ్డుకునే వారు లేకపోవడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతున్నది.
నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో గత సీపీ కాలం నుంచి హెల్మెట్ ధరించకపోవడంతోపాటు ప్రజల ప్రయోజనం పేరిట వేగ నియంత్రణలోనే వెళ్లే వాహనాలపై ఎడాపెడా జరిమానాలను పోలీసులు విధిస్తున్నారు. హెల్మెట్ పెట్టుకోకపోతే భారీగా జరిమానాలు విధిస్తున్న సమయంలో నంబర్ ప్లేట్ లేకుండా ఇసుక, మొరం వాహనాలు నగరంలో చక్కర్లు కొడుతుంటే ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
దీనికితోడు మైనింగ్ శాఖ అనుమతులు మంజూరు చేయని బాల్కొండ నియోజకవర్గంలోని మోర్తాడ్, భీమ్‌గల్, బాన్సువాడ నియోజకవర్గంలోని పొతంగల్, బోధన్ నియోజకవర్గ కేంద్రంలో ఇసుక మేటలను కొల్లగొడుతున్న అక్రమార్కులపై ఖాకీలు ఎందుకు దృష్టి సారించడంలేదు. అధికార పార్టీ నేతలకు పోలీసు ఉన్నతాధికారులే కొమ్ము కాస్తూ ఇసుక అక్రమ రవాణాకు సహకరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మోర్తాడ్ పోలీస్‌స్టేషన్ ఎదుట నుంచే ఇసుకాసురులు ఇసుకను వాహనాల్లో రయ్..రుయ్ మంటూ తరలించడం గమనార్హం. బీర్కూర్లోనూ పోలీస్ ఠాణా ఎదుట నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నా అడ్డుకునే నాథుడు కరువయ్యాడు.
పోలీసుల్లో కొంతమంది బరితెగించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇసుక పంచాయితీలు పోలీసు ఉన్నతాధికారుల చెంతకు వెళ్లినా డోంట్ కేర్ అన్నట్లుగా వ్యవహరిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. ఇసుక అక్రమరవాణాలో పాలుపంచుకున్న కారణంతో పదిమంది ఎస్సైలు, ఇద్దరు సీఐలపై నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు డీజీపీ మెమో జారీ చేశారు. అందులో ఈ 12 మందిపై బదిలీ వేటువేసి వెంటనే విచారణ ప్రారంభించాలని పేర్కొన్నారు. సదరు 12 మందికి స్థాన చలనం జరిగినప్పటికీ వారిలో ఇప్పటివరకు ఎవరిపై కూడా శాఖాపరమైన చర్యలు తీసుకోలేదు.
బదిలీతోనే మమ అనిపించారు. ఎస్సై, సీఐల వక్రమార్గాన్ని స్థానికంగా ఉన్నతాధికారులు పసిగట్టలేక పోవడంతోనే డీజీపీ నుంచి ఆదేశాలు వచ్చాయని పోలీస్ వర్గాల్లోనే చర్చ నడుస్తోంది. సీపీ నేతృత్వంలోనే కఠినమైన చర్యలు అమలు జరిగి ఉంటే అక్రమార్కులతో పోలీసులు చెట్టాపట్టాల్ వేసుకునే పరిస్థితి వచ్చేది కాదన్న భావన అందిరిలోనూ కలుగుతోంది. డీజీపీ ఆదేశాలతో ఒకింత ఖాకీల్లో కలవరం మొదలైంది. కొంత కాలంగా తప్పు చేసేందుకు జంకే పరిస్థితికి వచ్చారు. రెవెన్యూ, మైనింగ్ శాఖలతో సమన్వయం చేసుకునైనా ఇసుక దందాను అడ్డుకుని ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాలని ప్రజలంతా కోరుకుంటున్నారు