వినాయక్‌నగర్,సెప్టెంబర్ 15: నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 17న గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి (మల్టీజోన్-1) కోరారు. గణేశ్ శోభాయాత్ర కోసం రెండువేల మంది పోలీసు సిబ్బందితో పటిష్ట భద్రతా ఏ ర్పాట్లు చేసినట్లు తెలిపారు.
ఆదివారం జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయన వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో సీపీ కల్మేశ్వర్ సింగేనవార్,అదనపు డీసీపీ కోటేశ్వరరావు, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి,అధిక సిబ్బందిని అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు. శోభా యాత్ర జరిగే అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు వీడియో రికార్డింగ్ సైతం చేయనున్నట్లు వివరించారు. అవసరమైన ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లించనున్నట్లు తెలిపారు.
నిమజ్జన శోభభాయాత్ర ప్రశాంతంగా సాగేందుకు మండపాల నిర్వాహకులు, పెద్దలు, యువత, ప్రతి ఒక్కరూ పోలీసు సిబ్బందికి సహకరించాలని కోరారు. ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు యత్నిస్తే వారి పై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీజేలు ఏర్పాటు చేసేందుకు అనుమతులు లేవని, సౌండ్ సిస్టమ్స్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.