తెలుగమ్మాయి శ్రీలీల అద్భుతమైన అవకాశాన్ని దక్కించుకుంది. ఇప్పటికే తెలుగులో అగ్ర కథానాయికగా వెలుగొందుతున్న ఈ అందాలభామ.. ‘పరాశక్తి’ సినిమాతో తమిళచిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఆ సినిమా ఫలితం ఎలాగున్నా.. శ్రీలీలకు తమిళనాట అవకాశాలు మాత్రం బాగానే వరిస్తున్నాయి. తమిళ అగ్ర కథానాయకుడు అజిత్ హీరోగా అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించనున్న చిత్రంలో శ్రీలీల కథానాయికగా ఎంపికైందనేది లేటెస్ట్ న్యూస్.
ప్రస్తుతం తమిళ మీడియాలో ఈ వార్త బలంగానే వినిపిస్తున్నది. ఇక సినిమా విషయానికొస్తే.. ‘AK64’ వర్కింగ్ టైటిల్‌తో రూపొందనున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై టాలీవుడ్ అగ్ర నిర్మాత అనిల్ సుంకర నిర్మించనున్నారు. అనిరుధ్ సంగీత దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ ఈ నెలలోనే మొదలు కానున్నది. ఈ ఏడాది చివర్లో కానీ, సంక్రాంతి కానుకగా గానీ సినిమాను విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు.