వినాయక నగర్ ( నిజామాబాద్) : బీసీలను మోసం చేసే కుట్ర కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం చేస్తుందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal Suryanarayana) ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో బీసీ ఓట్ల (BC Votes) కోసం కాంగ్రెస్ పెద్ద డ్రామా ఆడిందని మండిపడ్డారు. బీసీలకు అన్యాయం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడం ఖాయమని హెచ్చరించారు.
కాంగ్రెస్ లెక్కల ప్రకారం దాదాపు 21 లక్షల బీసీల జనాభాను(Populations) తక్కువ చేయించారని ఆరోపించారు. 10 ఏళ్ల నుంచి బీసీలు ఏమైనా అంతరించిపోతున్న వర్గంగా ప్రభుత్వం భావిస్తుందాఅని ప్రశ్నించారు. దీని వల్ల లక్షల బీసీ కుటుంబాలు తమ రిజర్వేషన్ (Reservation) కోల్పోయే ప్రమాదముందన్నారు. బీసీ కులగణన పేరుతో కాంగ్రెస్ పెద్ద కుట్ర చేయబోతున్న విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. 10. 8 శాతం మంది ముస్లిములను బీసీలో కలిపే కుట్రకు కాంగ్రెస్ పునుకుందన్నారు. బీసీలకు అన్యాయం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.
ముఖ్యమంత్రి రేవంత్ (Revanth Reddy) , మంత్రివర్గం మతిలేని చేష్టలు చేస్తూ తెలంగాణ బిడ్డలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు ఆమోదం లేని తీర్మానాలు చేసి పంపితే కేంద్రం అందుకు అంగీకరించదని అన్నారు. బీసీలకు స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ అమలుకు తాము వ్యతిరేకం కాదని, బీసీ కులగణన పేరుతో మైనారిటీ వర్గాన్ని బీసీలో కలిపే కుట్రను వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు.
తూ తూ మంత్రంగా నిర్వహించిన సర్వే కాకుండా నిజమైన బీసీల లెక్కలు తేల్చాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కు బీసీ బిడ్డలపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే మంత్రి వర్గంలో బీసీలకు ఎందుకు సమూచిత న్యాయం కల్పించలేకపోతున్నారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీలు ఏమయ్యాయో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
బీసీల పై ప్రేమ ఉంటే రాబోయే బడ్జెట్ లో ఇచ్చిన హామీ ప్రకారం 20వేల కోట్ల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రతి జిల్లా కేంద్రంలో బీసీ గురుకుల డిగ్రీ కాలేజ్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు లక్ష్మీనారాయణ, మాజీ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.