హైదరాబాద్‌లో హైడ్రా తరహాలో నిజామాబాద్‌లో నిడ్రా తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ఆక్రమణల తొలగింపు పేరిట రాజధాని వాసుల్లో వణుకు పుట్టించిన సర్కారు.. ఇందూరులోనూ బుల్డోజర్లకు పని చెప్పే దిశగా పావులు కదుపుతున్నది. ఈ అంశాన్ని ఎవరో కాదు, స్వయంగా పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్ వెల్లడించారు. నిడ్రాను ఏర్పాటు చేస్తామని చెప్పారు. దీంతో వాగులు,చెరువుల వెంట ఇండ్లు నిర్మించుకున్న వారిలో కలకలం మొదలైంది. హైడ్రా తరహాలోనే నిడ్రా కూడా పేదల ఇండ్లను కూల్చే ప్రమాదముందన్న భయాందోళన వ్యక్తమవుతున్నది. మొత్తంగా పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు జిల్లాలో ప్రకంపనలు రేపుతున్నాయి.
-నిజామాబాద్ అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
వస్తుందని పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్ జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత సొంత జిల్లా నిజామాబాద్‌కు తొలిసారి వచ్చిన ఆయన.. శనివారం జిల్లా కేంద్రంలో విలేకరులతో నిర్వహించిన చిట్‌చాట్ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రాపై పలువురు ప్రశ్నలు గుప్పించగా నిడ్రా అవసరాన్ని నొక్కి చెప్పారు. ఆక్రమణల కూల్చివేతలు తప్పదని, అందులో తన సొంత తమ్ముడు, బంధువులున్నా కూల్చివేతలు ఖాయమన్నారు.
పీసీసీ చీఫ్ పేల్చిన నిడ్రా బాంబుతో నగర వాసుల్లో ఉలికిపాటు మొదలైంది. ముఖ్యంగా పులాంగ్ వాగు తీవ్రమైన ఆక్రమణలకు గురైంది. ఇందులో కాంగ్రెస్ సానుభూతిపరులు, హస్తం నేతలకు ప్రత్యక్ష సంబంధం ఉంది. ఈ దశలో నిడ్రా ఏర్పాటైతే కూల్చివేతల పర్వం పులాంగ్ నుంచే మొదలవుతుందా.. లేదంటే ఇతర ప్రాంతాలను ఎంచుకుని ముందుకెళ్తారా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. నిడ్రాను నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తారా.. హైడ్రా తరహాలో స్వతంత్ర హోదాతో రంగంలోకి దింపుతారా? అన్న స్పష్టత ప్రస్తుతానికి లేదు.
నగరంలోని రామర్తి చెరువు కబ్జాలపై ఇటీవల జోరుగా చర్చ నడుస్తున్నది. ఎఫ్టీఎల్ పరిధిలో పదుల సంఖ్యలో ఇళ్లు వెలిశాయి. వానకాలంలో ఈ జనావాసాలను చెరువు నీళ్లు చుట్టేస్తున్నాయి. పదేండ్ల్ల క్రితం నాడు కాంగ్రెస్ పాలకులే ఆక్రమణలను పెంచి పోషించారు. ఇందులో హస్తం నేతలే ప్రధాన కారకులుగా ఉన్నారు. ఇప్పుడు నిడ్రా పేరుతో నగరంలో కూల్చివేతలు మొదలు పెడితే రామర్తి చెరువు నుంచే ప్రారంభించాలన్న డిమాండ్ వినిపిస్తున్నది. వాగులు, చెరువులను కాపాడేందుకు నడుం బిగిస్తే ముందుగా కాంగ్రెస్ పాలకుల హయాంలో కబ్జాలకు గురైన కుంటలు, జలాశయాల్లోనే కూల్చివేతలు మొదలు పెట్టాల్సి ఉంది.
హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన హైడ్రా ముఖ్యంగా పేదల పాలిట గుదిబండగా మారింది. దీంతో ఈ వ్యవస్థపైనే విమర్శలు వెత్తుతున్నాయి. కోర్టు కేసులు, ఆందోళనలు, కూల్చివేతలు, పేదల నిరసనల మధ్య హైడ్రా పనితీరు కొనసాగుతున్నది. హైడ్రా కూల్చివేతల పర్వం పలు జిల్లాల్లోనూ మొదలైంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్‌కు సైతం నిడ్రా అవసరమని కాంగ్రెస్ అధ్యక్షుడే స్వయంగా చెప్పడంతో ఇందూర్లోనూ కూల్చివేతలు తప్పవని తేలిపోయింది.
నిడ్రా అవసరమే కానీ అది పేదల జోలికి వెళ్లనంత వరకే. పేదల ఇండ్లు కూల్చివేతలు మొదలు పెడితే ఇబ్బందులు తలెత్తడం ఖాయం. పులాంగ్ వాగు చుట్టూ అనేక ప్రాంతాల్లో బఫర్ జోన్ కబ్జాలకు గురైంది. ఇందు లో పలు కమ్యూనిటీ సంఘాలు, ప్రముఖుల ఇండ్లు కూడా ఉన్నాయి. వాగుకు అడ్డంగా గోడలు నిర్మించుకుని సైతం దర్జాగా ఆక్రమణలకు పాల్పడ్డారు.
అలాంటి వారికి నిడ్రా తగిన గుణపాఠం చెబుతుందని ఓవైపు హర్షం వ్యక్తమవుతుండగా, మరోవైపు బఫర్ జోన్ పేరుతో పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు పంపితే వ్యతిరేకత వెల్లువెత్తడం ఖాయమన్న భావన వ్యక్తమవుతున్నది. గూపన్పల్లి ప్రాంతంలో వందలాది పేద కుటుంబాలు ఇండ్లు కట్టుకుని నివసిస్తున్నాయి. ముబారక్‌నగర్ శివారులోనూ ఇదే పరిస్థితి. గంగాస్థాన్ ఫేజ్-1లో ఒక పేరు మోసిన గేటెడ్ కమ్యూనిటీ సైతం బఫర్ జోన్లోనే ఉన్నట్లు ప్రచారం ఉంది. నిడ్రా రాక నేపథ్యంలో వీటి భవితవ్యం ఏమిటనే చర్చ మొదలైంది.
మొత్తంగా పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లోనూ దుమారం రేపుతున్నాయి. మహేశ్‌కుమార్‌గౌడ్ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న ప్రతిపక్ష పార్టీలు.. ఎవరిని టార్గెట్‌గా చేసుకుని నిడ్రాను తీసుకు రానున్నారనే అంశంపై దృష్టి సారించాయి. ప్రతిపక్షాలపై రాజకీయ కక్ష సాధింపునకే ఇదంతా జరుగుతుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి నిడ్రా అవసరంపై పీసీసీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలతో వాగులు, చెరువుల వెంట ఇళ్లు నిర్మించుకున్న వారిలో భయాందోళనలు రేకెత్తిస్తుండగా, రాజకీయంగానూ ప్రకంపనలు రేపుతున్నది.