ఉమ్మడి జిల్లాలో ‘కారు’ జోరు కొనసాగుతున్నది. నిత్యం వేలాది మంది చేరికలతో ‘గులాబీ’ పార్టీ గుబాళిస్తున్నది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ ఖాళీ అవుతుంటే, బీఆర్ఎస్ మరింత బలోపేతమవుతున్నది. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలను వీడి వేలాది మంది గులాబీ గూటికి చేరగా, తాజాగా శుక్రవారం కూడా బీఆర్ఎస్లోకి వలసలు కొనసాగాయి. మాజీ ఎమ్మెల్యే బి.జనార్దన్‌గౌడ్ కాంగ్రెస్‌ను వీడి కారెక్కారు. మంత్రి కేటీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డిలోనూ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ సమక్షంలో 300 మందికి పైగా పార్టీలో చేరారు. అటు, బాల్కొండ నియోజకవర్గంలో మంత్రి వేముల సమక్షంలో వందలాది మంది బీఆర్ఎస్ కండువాలు కప్పుకున్నారు. నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బోధన్ నియోజకవర్గాల్లోనూ వలసలు కొనసాగాయి. కాంగ్రెస్, బీజేపీలను వీడి బీఆర్ఎస్లో పెద్దసంఖ్యలో చేరగా.. ఎమ్మెల్యేలు బాజిరెడ్డి, జీవన్‌రెడ్డి, షకీల్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
కామారెడ్డి/మోర్తాడ్/నిజామాబాద్ రూరల్/ ఆర్మూర్/ రెంజల్/ముప్కాల్/మెండోరా, అక్టోబర్ 27 : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్లోకి చేరికల జోరు కొనసాగుతున్నది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో బీఆర్ఎస్లో చేరుతున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని వడ్లూర్, టేక్రియాల్‌కు చెందిన 100 మంది, భిక్కనూర్ మండలం కాచాపూర్, రామారెడ్డి మండలం రెడ్డిపేట్ గ్రామాలకు చెందిన సుమారు 200 మంది బీజేపీ,కాంగ్రెస్‌కు రాజీనామా చేసి విప్ గంపగోవర్ధన్, ఫుడ్ కమిషన్ మాజీ చైర్మన్ తిరుమలరెడ్డి సమక్షంలో శుక్రవారం బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అభివృద్ధి చేశారన్నారు. మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేస్తారన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో 60 ఏండ్లు పాలించిన కాంగ్రెస్, బీజేపీలు పేద ప్రజలకు చేసిందేమి లేదని అన్నారు.ఈ ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా పని చేసి కారు గుర్తుకు ఓటు వేసి కామారెడ్డి నుంచి కేసీఆర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పున్న రాజేశ్వర్ పాల్గొన్నారు.
రానున్న ఎన్నికల్లో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి మద్దతుగా మోర్తాడ్‌కు చెందిన దూదేకుల సంఘం సభ్యులు వేల్పూర్‌లో మంత్రి సమక్షంలో శుక్రవారం బీఆర్ఎస్లో చేరారు. వీరందరికి మంత్రి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అదే విధంగా మెండోరా, ముప్కాల్ మండల కేంద్రాల్లో నిర్వహించిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాల్లో వివిధ పార్టీలకు చెందిన నాయకులు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి వేముల గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
నిజామాబాద్ నగర శివారులోని 1వ డివిజన్ పరిధిలో ఉన్న కాలూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎన్నం రాజేశ్వర్‌రెడ్డి, ఎన్నం నర్సారెడ్డి, జిన్న సంపత్‌రెడ్డితో పాటు పలువురు నిజామాబాద్‌లో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్సీ, అసెంబ్లీ ఎన్నికల ఇన్చార్జి వీజీగౌడ్ల సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి గులా బీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో నుడా చైర్మ న్ ఈగ సంజీవరెడ్డి, బోర్గాం(పీ) సొసైటీ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి, కాలూర్ గ్రామ పెద్దలు జిన్న వెంకట్‌రెడ్డి, పడిగెల వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్‌రెడ్డి సమక్షంలో ఆర్మూర్ నియోజకవర్గ కుర్మ సంఘం సభ్యులు, పెర్కిట్‌కు చెందిన కాంగ్రెస్ మైనారిటీ నాయకులు, యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి జీవన్‌రెడ్డి గులాబీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
రెంజల్ మండలం సాటాపూర్‌లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి హాజరైన బోధన్ ఎమ్మెల్యే షకీల్ సమక్షంలో కాంగ్రెస్, బీజేపీలకు చెందిన మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద సంఖ్య లో బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరినవారిలో మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి ముఖ్య అనుచరుడు కాంగ్రెస్‌కు చెందిన ఫిరోజ్బేగ్, రెంజల్ మాజీ ఉప సర్పంచ్ గవాస్కర్‌తోపాటు బోర్గాం, నీలా, కందకుర్తి, తాడ్‌బిలోలి, రెంజల్, వీరన్నగుట్ట తండా, దూపల్లి, దండిగుట్ట, కూనేపల్లి గ్రామాలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం కల్పిస్తామన్నారు.