తెలంగాణ యూనివర్సిటీలో అనిశ్చితి రోజుల తరబడి కొనసాగుతూనే ఉంది. తెర దించాల్సిన అధికార కాంగ్రెస్ పార్టీ పెద్దలు కనీసం పట్టించుకోవడం లేదు. టీయూ పెద్దలు మొండికేసి మోనమే సమాధానంగా ఇస్తున్నారు. హైకోర్టు తీర్పు వెలువడి రెండు వారాలు దాటినప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు. న్యాయ వ్యవస్థకు ఎదురు ఈదుతూ టీయూ సారథులు ఏం సాధించబోతున్నారన్నది అంతు చిక్కడం లేదు. చేతికి అధికారికంగా తీర్పు కాపీ వచ్చినప్పుడే తదుపరి చర్యలు తీసుకుంటామని వీసీ, రిజిస్ట్రార్లు పలువురితో చెబుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి దేశంలో సుప్రీం కోర్టు, ఆయా రాష్ర్టాల హైకోర్టులు వెలువరించే తీర్పులు చాలా ప్రధానమైనవి.
వాటిని తక్షణం అమలు చేయడం సంబంధిత వర్గాలు, సంస్థలు, ప్రభుత్వాల కనీస విధి. ఉదాహారణకు గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలపై ద్విసభ్య ధర్మాసనం తీర్పును వెలువరించింది. ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును పక్కన పెట్టింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ తీర్పు కాపీలు చేతికి వచ్చేంత వరకు ఆగలేదు. హైకోర్టు హాలులో న్యాయమూర్తి వెలువరించిన తీర్పును రాత్రికి రాత్రే అమలు చేశారు. మెయిన్స్ ఫలితాలు అందించి ఏకంగా మూడు, నాలుగు రోజుల్లోనే నియామక పత్రాలను ఇచ్చారు. తెలంగాణ యూనివర్సిటీలో మాత్రం చేతికి హైకోర్టు తీర్పు కాపీలు అధికారికంగా వచ్చిన తర్వాతే అమలు చేస్తామంటూ చెప్పుకుంటుండటం విచిత్రంగా మారిందని విద్యార్థి సంఘాలు దుమ్మెత్తి పోస్తున్నాయి.
టీయూలో 2012 నోటిఫికేషన్లను హైకోర్టు రద్దు చేసిన దరిమిలా ఈ వ్యవహారంపై బీఆర్ఎస్వీ, ఏబీవీపీ, పీడీఎస్‌యూ, ఏఐఎఫ్బీ, బీవీఎం వంటి సంఘాలతో పాటుగా అధికార కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఎన్ఎస్యూఐ గళం వినిపించాయి. హైకోర్టు తీర్పును అమలు చేయాలంటూ తెలంగాణ యూనివర్సిటీ పరిపాలన భవనం ఎదుట ఆందోళనలు చేపట్టాయి. హైకోర్టు తీర్పు కాపీలను ప్రింట్ తీసి వాటిని నేరుగా వైస్ ఛాన్స్లర్ ప్రొ.టి.యాదగిరి రావుకు సమర్పించారు. రిజిస్ట్రార్‌కు హైకోర్టు తీర్పు కాపీలను అందించేందుకు పలు విద్యార్థి సంఘాలు ప్రయత్నించగా వాటిని స్వీకరించేందుకు సిద్ధపడలేదని విద్యార్థి నాయకులు ఆరోపిస్తున్నారు.
రోజులు గడుస్తున్నప్పటికీ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పులపై నోరు విప్పకపోవడంపై సర్వత్రా వ్యతిరేకత ఏర్పడుతోంది. టీయూలో ఏర్పడిన సందిగ్ధతపై తక్షణం స్పందించాలని కోరుతూ ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యదర్శిలకు వినతి పత్రాలు సమర్పించారు. ఈ కేసుపై పోరాటం చేసిన వెంకట్ నాయక్ నేరుగా ఉన్నత విద్యాశాఖ, ఆర్థిక శాఖ కార్యదర్శులను స్వయంగా కలిసి విన్నపాలు సమర్పించారు. 2012లో రద్దు కాబడిన ప్రొఫెసర్లకు హైకోర్టు తీర్పు మేరకు తక్షణం జీతాలు నిలిపేయాలని అందులో పేర్కొన్నారు. విద్యార్థి సంఘాలు ఈ అంశంపై రగులుతున్నాయి. తీర్పు అమలుకై నడుం బిగించాయి. అధికార కాంగ్రెస్ పార్టీ చెంతకు చేరిన టీయూ పంచాయితీకి ఎప్పుడు ఫుల్స్టాప్ పడుతుందోనని అందరూ ఎదురు చూస్తున్నారు.
తెలంగాణ యూనివర్సిటీ పాలకవర్గం భేటీపై ఎలాంటి స్పష్టత రావడం లేదు. ప్రస్తుతం క్లాస్ 1 ఈసీ మాత్రమే మనుగడలో ఉంది. ప్రభుత్వం నియమించిన పాలకవర్గం లేదు. హైకోర్టు తీర్పు సమాచారం తమకు అధికారికంగా అందలేదని టీయూ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు 2012 హైకోర్టు తీర్పుపై ఈసీ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామంటూ వీసీ చెబుతున్నారు. ఈ ద్వంద ప్రకటనలపై విద్యార్థి సంఘాలు, విద్యార్థులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. చివరికి హైకోర్టు తీర్పుతో ఉద్యోగాలు రద్దు కాబడిన 45 మంది ఆచార్యులు సైతం తీవ్ర గందరగోళంలోనే కొనసాగుతున్నారు.
అసలు ఏం జరుగుతుందో వారికి కూడా స్పష్టత రావడం లేదు. దీనంతటికీ టీయూను నిడిపించే పెద్ద మనుషులే కారణమని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. కుట్ర పూరితంగానే హైకోర్టు తీర్పును చిన్నపాటి సాకులతో తాత్సారం చేస్తూ ఈ రకమైన దుస్థితికి కారణంగా నిలుస్తున్నారని మండిపడుతున్నారు. జూబ్లిహిల్స్ ఎన్నికల్లో తలామునకలైన అధికార పార్టీ నేతలు ఇప్పటికైనా టీయూ వ్యవహారంపై దృష్టి పెట్టి ముగింపు పలుకుతారా? లేదంటే గాలికి వదిలేస్తారా? అన్నది వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.