మోర్తాడ్, అక్టోబర్ 9: బీసీ రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్, బీజేపీ కపటరాజకీయాలు చేస్తూ, బీసీలను మోసం చేస్తున్నాయని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో స్పందించిన వేముల గురువారం ప్రకటన విడుదల చేశారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ కపటరాజకీయాలు చేస్తూ న్యాయస్థానాలపై నెపం నెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంలో కాంగ్రెస్ తెలివిగా డ్రామాలాడుతున్నదని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ మరోసారి తన చిత్తశుద్ధిలేనితనం, కపట ప్రేమను బయటపెట్టుకున్నదని విమర్శించారు.
తాము పెంచాలనుకున్నామని, కానీ కోర్టు అడ్డుపడిందని.. నెపాన్ని న్యాయస్థానంపై నెట్టి, బీసీలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. చెల్లదని తెలిసినా బీసీలను మభ్యపెట్టే ఉద్దేశంతో రిజర్వేషన్ పెంపు జీవో జారీ చేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అని, ఆ తర్వాత ఆ పార్టీ అనుచరులతో కోర్టులో కేసు వేయించి ఆ నిర్ణయాన్ని అడ్డుకోవాలని కుట్రచేసింది కాంగ్రెస్సేనని విమర్శించారు. ఈ ద్వంద్వ నాటకం ఎవరికోసమ ని, ఎవరిని పిచ్చోళ్లను చేయడానికి ఈ డ్రామాలు ఆడుతున్నావ్ రేవంత్‌రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరుతో 42 శాతం రిజర్వేషన్లు అంటూ బీసీ ఓట్ల కోసం మోసం చేసిందని మండిపడ్డారు. నేడు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధికోసం అదే పాత బీసీ రిజర్వేషన్ డ్రామా మళ్లీ మొదలు పెట్టిందని పేర్కొన్నారు. రాజ్యాంగ సవరణ కోసం 22 నెలలుగా ఢిల్లీలో పోరాటం చేయకుండా, గల్లీలో మాత్రం డ్రామాలు ఆడుతున్నదని కాంగ్రెస్ పార్టీ తీరుపై వేముల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ధర్నా చేసినప్పుడు ఆ పార్టీ ముఖ్యనాయకులు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే ఇలా ఏ ఒక్కరూ అక్కడికి రాలేకపోవడం బీసీలపై కాంగ్రెస్‌కు ఉన్న చిత్తశుద్ధి ఏమిటో స్పష్టమవుతున్నదన్నారు.
బీసీ రిజర్వేషన్లపై ఉభయ చట్టసభల్లో తీర్మానం చేసి గవర్నర్‌కి పంపినప్పుడు ఆయన తొక్కిపెట్టడం, గతంలో తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపితే అక్కడ కూడా ఆమోదం తెలుపకపోవడంతో కేంద్రంలో ఉన్న బీజేపీకి బీసీలపై ఉన్న చిత్తశుద్ధి ఏమిటన్నది తెలుస్తున్నదని పేర్కొన్నారు. బీసీ ప్రధాని అంటూ గొప్పలు చెప్పుకునే మోదీ కూడా కాంగ్రెస్‌తో కలిసి బీసీ రిజర్వేషన్ల పెంపు కాకుండా చేస్తున్నారని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ఢిల్లీలో కాంగ్రెస్ నిజాయితీగా పోరాటం చేస్తే బీఆర్ఎస్ కూడా వస్తుందని, కానీ ప్రజలను మోసం చేసే కపటరాజకీయాలకు తాము సహకరించబోమని స్పష్టం చేశారు. ఇప్పటికైనా రేవంత్‌రెడ్డి బీసీలను రాజకీయ లబ్ధి కోసం వాడుకోకుండా రిజర్వేషన్ల పెంపు పై చిత్తశుద్ధితో పనిచేయాలని డిమాండ్ చేశారు.