నేటి నుంచి హెల్మెట్ధారణను నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్లో తప్పనిసరి చేయబోతున్నారు. ఇదివరకే ఉన్న నిబంధనను కఠినంగా అమలు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలను నడిపితే భారీ జరిమానాలు విధించనున్నారు. ఈ విషయాన్ని మూడు వారాల ముందుగానే ప్రజలకు తెలియజేసినప్పటికీ.. హెల్మెట్ వాడకంపై కనీస అవగాహన కార్యక్రమాలను చేపట్టలేదు. నామమాత్రంగా ప్రచారం చేసి ప్రజలపై జరిమానాలు విధించడమే లక్ష్యంగా పోలీసులు రంగం సిద్ధం చేశారు. హెల్మెట్ వాడకాన్ని కచ్చితంగా అమలు చేయడం మంచిదే అయినప్పటికీ క్షేత్రస్థాయిలో ట్రాఫిక్ నియంత్రణపైనా పోలీసులు దృష్టి పెట్టాలని జనాలు కోరుకుంటున్నారు.
-నిజామాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
నిజామాబాద్లో ఏ మూలకు వెళ్లినా ట్రాఫిక్ పోలీసుల నియంత్రణ లేమి కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. విశాలంగా ఉన్న రోడ్ల దగ్గరి నుంచి మొదలు పెడితే ఇరుకు రోడ్ల వరకు ఎటువెళ్లినా తలపోటు తథ్యమనేది అందరికీ తెలిసిందే. వాణిజ్య, వ్యాపార, హోటళ్లు, హాస్పిటల్ ఏరియాలో బండి వేసుకొని తిరగాలంటే ఇక నరకప్రాయంగానే ఉంటున్నది. వీటిని మాత్రం పోలీసులు పట్టించుకోకుండా కేవలం హెల్మెట్ మాత్రమే వాడాలంటూ ప్రజలపై ఒత్తిడి చేస్తుండడం విచిత్రంగా మారింది. ప్రజల బాధ్యతను గుర్తుచేస్తున్న దరిమిలా ట్రాఫిక్ పోలీసుల విధిని కూడా బహిరంగపరుస్తున్నారు. పల్లెటూర్ల నుంచి నిత్యం వేలాది మంది నిజామాబాద్ నగరానికి వస్తూ వెళ్తుంటారు. వారికి ట్రాఫిక్ నియమాలపై అంతగా అవగాహన ఉండదు.
కానీ ట్రాఫిక్ పోలీసులు మాత్రం వారిపై జరిమానాల భారాన్ని ఎడాపెడా వేస్తున్నారు. ఒకటికి మించి జరిమానాలు విధించే బదులుగా అవగాహన కల్పించడం, కౌన్సిలింగ్ నిర్వహించే పద్ధతిని ఎందుకు అవలంభించడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కానీ ఇదేదీ పట్టించుకోకుండా పద్మవ్యూహంలాంటి ట్రాఫిక్ నియంత్రణ చేయకుండా హెల్మెట్ నిబంధనను ప్రజలపై రుద్దడానికి పోలీసులు చేస్తున్న ప్రయత్నంపై జనాల్లో ఒకింత అసంతృప్తిని పెంచి పోషిస్తున్నది. శ్రీరామనవమి, ఉగాది వంటి పర్వదినాలు, సెలవు దినాల్లో జరిమానాల పర్వం జోరుగా నిర్వహించే ఖాకీలు వాహనాల రద్దీని క్రమపద్ధతిలో నడిపించేందుకు ఆసక్తి చూపకపోవడం విడ్డూరంగా మారింది.
ప్రభుత్వం తీసుకోబోయే ఏ చర్యనైనా ఆదర్శవంతంగా ఉండాలి. ప్రభుత్వంలోని బాధ్యులు పాటించి ఇతరులకు స్ఫూర్తిని రగిలించాలి. కానీ అలాంటిదేమీ మచ్చుకూ పోలీస్ కమిషనరేట్లో కనిపించడం లేదు. ఖాకీ డ్రెస్సు లో చలాన్లు విధిస్తున్న పోలీసులే హెల్మెట్ నిబంధనను విస్మరిస్తున్నారు. ఇలా ముక్కున వేలేసుకునేలా ఖాకీలే నిబంధనలు ఉల్లంఘిస్తున్న దాఖలాలు అనేకం నిత్యం కనిపిస్తున్నాయి. సీపీ కల్మేశ్వర్ సింగేనవార్ ఆదేశాలు కేవలం సామాన్యులకే పరిమితమా? పోలీసులకు అమ లు కావా? అన్న చర్చ జరుగుతున్నది. పోలీసులు కేవలం హెల్మెట్ నిబంధననే అమలు చేసి మమ అనిపిస్తారా? పారదర్శకంగా చట్టంలోని నిబంధనలు అమలు చేసి శెభాష్ అనిపించుకుంటారా? అనేది వేచి చూడాల్సిందే.
పంద్రాగస్టు నుంచి కచ్చితంగా హెల్మెట్ వినియోగాన్ని ప్రతి ద్విచక్ర వాహనాదారుడు అలవర్చుకోవాలి. ఈ నియమాన్ని ప్రజల రక్షణలో భాగంగానే అమలు చేస్తున్నాం. హెల్మెట్ లేకుం డా బయటికి వచ్చే ద్విచక్ర వాహనాలను సీజ్ చేస్తాం. జరిమానాలు విధిస్తాం. పోలీసు శాఖకు ప్రజలు సహకరించాలని కోరుతున్నాం.
– నారాయణ, ట్రాఫిక్ ఏసీపీ, నిజామాబాద్
ఖలీల్వాడి, ఎల్లమ్మగుట్ట, పోచమ్మగల్లి, పెద్దబజార్, కోటగల్లి, గోల్హనుమాన్, బస్టాండ్, రైల్వే స్టేషన్, పాత కలెక్టరేట్, సీపీ ఆఫీస్, ఏసీపీ కార్యాలయం, సుభాష్ నగర్, హమాల్వాడి, శ్రద్ధానంద్ గంజ్, కొత్త కలెక్టరేట్, పూసలగల్లీ, గాంధీ చౌక్, నెహ్రూ చౌక్, ఖిల్లా రోడ్డు, నటరాజ్ థియేటర్, అర్సపల్లి, ఆటోనగర్, న్యాల్కల్ రోడ్డు, వర్ని చౌరస్తా, ఫులాంగ్ చౌరస్తా, వినాయక్ నగర్