నమస్తే తెలంగాణ యంత్రాంగం, అక్టోబర్ 20: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో శనివారం రాత్రి, ఆదివారం భారీ వర్షం కురిసింది. దీంతో పలు మండలాల్లో పంటలు దెబ్బతినగా.. ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం నల్లమడుగు, బాణాపూర్, కోర్పోల్, బాయంపల్లి, లింగంపల్లి, ఐలాపూర్, మెంగారం, శెట్పల్లి తదితర గ్రామాల్లో ఆదివారం కురిసిన వర్షానికి కోత దశకు చేరిన వరి పంట నేలవాలినట్లు రైతులు తెలిపారు.
లింగంపేట ధాన్యం కొనుగోలు కేంద్రంలో విద్యుత్ దీపాలు ఏర్పాటుచేయకపోవడంతో అంధకారం నెలకొన్నది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, బోధన్, భీమ్గల్, రుద్రూర్, కోటగిరి, నవీపేట, రెంజల్ మండలాల్లో భారీ వర్షం కురిసింది. సాలూరా మండలంలోని హున్సా, ఫత్తేపూర్, ఖాజాపూర్ గ్రామాల్లో వరి, సోయాబీన్ కుప్పలు తడిసి ముద్దయ్యాయి. భీమ్గల్ కేంద్రంలో ఆరబెట్టిన ధాన్యం కుప్పల్లోకి వర్షపునీరు చేరింది.
రెంజల్ మండలంలోని కందకుర్తి, బోర్గాం, నీలా, తాడ్బిలోలి గ్రామాల్లో రైతులు సాగు చేసి చేతికొచ్చిన సోయా పంట తడిసిపోయింది. ఉమ్మడి కోటగిరి మండలంలో రైతులు ఆరబెట్టిన ధాన్యంలోకి వర్షపు నీరు చేరింది. నవీపేట మండలంలోని రాంపూర్, రెడ్డిఫారం మోకన్పల్లి, నాళేశ్వర్ తదితర గ్రామాల్లో చేతికి వచ్చిన ధాన్యం తడిసి పోయింది. తడిసిన వరి ధాన్యాన్ని ఆర బెట్టేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.