నిజామాబాద్ జిల్లాలో సోమవారం అర్ధరాత్రి నుంచి కురుస్తున్న అకాల వర్షాలకు పలుచోట్ల పంటలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాల్లో వరి కోతలు చురుగ్గా సాగుతున్నాయి. చేతికి వచ్చిన ధాన్యాన్ని ఆరబోయగా తడిసి ముద్దవ్వడంతో రైతులు లబోదిబోమంటున్నారు. కోటగిరి, పోతంగల్, బోధన్, ఎడపల్లి ధర్పల్లి, సిరికొండ మండలాల్లో కోతకు వచ్చిన వరి నేల వాలింది. జుక్కల్, బిచ్కుంద నిజాంసాగర్ మండలాల్లో పంట నష్టం వాటిల్లింది.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో అకాల వానలు పసుపు రైతులను ఇబ్బందికి గురిచేసింది. పసుపు అమ్మేందుకు వచ్చిన రైతులకు నష్టం వాటిల్లింది. ఒకట్రెండు రోజుల్లో పసుపును అమ్మేందుకు రైతులు సిద్ధమవుతుండగా పసుపు కుప్పలు వరద నీళ్లలో మునిగిపోయాయి.