Mamata Banerjee : పశ్చిమబెంగాల్ (West Bengal) మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి (TMC Chief) మమతాబెనర్జి (Mamata Banerjee) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పార్టీని వీడి వెళ్లిన నేతలను తిరిగి చేర్చుకునే ప్రసక్తే లేదని ఆమె స్పష్టంచేశారు. అదే సమయంలో రాష్ట్రంలో బీజేపీని ఎదుర్కొనేందుకు ‘ఇండియా కూటమి (India Alliance)’ లోని పక్షాలన్నీ ఐక్యంగా ఉండాల్సిన అవసరాన్ని ఆమె నొక్కిచెప్పారు.
కోల్కతాలో మంగళవారం ఓ కార్యక్రమంలో మమతబెనర్జీ మాట్లాడారు. లౌకికవాదాన్ని, సమాఖ్య స్ఫూర్తిని, ప్రజా సంక్షేమ పాలనను కాపాడుకోవడానికి ప్రతిపక్షాల ఐక్యత ఎంతో ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. విపక్ష కూటమిలోని పార్టీలు విభేదాలను పక్కనపెట్టి ఏకం కావాలని పిలుపునిచ్చారు. పార్టీని వీడిన ద్రోహులను ఎప్పటికీ తిరిగి చేర్చుకోబోమని, ఈ విషయంలో తనకు ఎలాంటి భేషజాలు లేవని స్పష్టంచేశారు.
‘పార్టీని వీడుతున్న వారికి నేను ఒక్కటే చెబుతున్నా. బీజేపీకి మద్దతుగా నిలవాలనుకుంటే నేరుగా ఆ పార్టీలోనే చేరి ఎన్నికల్లో పోటీ చేయాలని సవాల్ చేస్తున్నా. ఎంత ఎక్కువమంది వెళ్లిపోతే నాకు అంత సంతోషం. ఆయా స్థానాలను యువ నాయకులతో భర్తీ చేస్తా’ అని మమతాబెనర్జి వ్యాఖ్యానించారు.