– కేంద్ర దమనకాండను ఖండించిన నల్లగొండ న్యాయవాదులు
– కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్
– నల్లగొండ జిల్లా కోర్టు ఎదుట నల్ల బ్యానర్లతో నిరసన
రామగిరి, జూలై 21 : దేశంలో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తో ముడిపడి ఉన్న నీట్ (NEET) పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులపై కేంద్ర ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండను తీవ్రంగా ఖండిస్తున్నామని సీనియర్ న్యాయవాదులు మల్లేపల్లి ఆదిరెడ్డి, జి.మోహన్ తెలిపారు. నీట్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం నల్లగొండ జిల్లా న్యాయస్థానం ప్రధాన ద్వారం ఎదుట న్యాయవాదులు నల్ల బ్యానర్ చేబూని నల్లగొండ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత సాగిస్తున్న పోరాటానికి తమ సంపూర్ణ సంఘీభావాన్ని ప్రకటించారు.
ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాదులు ఆదిరెడ్డి, జి.మోహన్ మాట్లాడుతూ… ప్రశ్నించే విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం, తలలు పగిలేలా కొట్టడం, అక్రమంగా అరెస్టులు చేయడమేనా కేంద్ర ప్రభుత్వ ప్రజాస్వామ్య విధానం అని ప్రశ్నించారు. పరీక్షల నిర్వహణలో వైఫల్యం చెంది విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన ప్రభుత్వం, తమ తప్పును దిద్దుకోకుండా శాంతియుతంగా పార్లమెంట్ ముట్టడికి బయలుదేరిన విద్యార్థులు, తల్లిదండ్రులపై పాశవికంగా దాడులు చేయడం అన్యాయమన్నారు.
న్యాయవాదులు జి.వెంకటేశ్వర్లు, అనంతుల శంకరయ్య, దర్శనం నరసింహ మాట్లాడుతూ… నీట్ పరీక్షా వ్యవస్థపై విద్యార్థుల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించాలంటే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో లేదా స్వతంత్ర ఉన్నత స్థాయి దర్యాప్తు సంస్థతో నిష్పక్షపాత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని, అరెస్టయిన విద్యార్థులందరినీ బేషరతుగా విడుదల చేయాలని కోరారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన ప్రభుత్వాలు భావప్రకటనా స్వేచ్ఛను, పౌరుల నిరసన తెలిపే హక్కును గౌరవించాలని హితవు పలికారు. ఈ నిరసన కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు కట్టా అనంతరెడ్డి, గుర్రం వెంకట్ రెడ్డి, బ్రహ్మచారి, భువనగిరి రవి, నర్సాజి, నాగిరెడ్డి, బొమ్మరబోయిన వెంకన్న, కిషోర్ కుమార్, పందుల సైదులు, అన్నపూసల ఐలేష్, పజ్జూరి స్వామి గౌడ్, శేఖర్, ఎన్. రాములు, సంద యాదయ్య, ఆవుల ప్రేమ సుందర్, దున్న లింగస్వామి, బరిగల సైదులు, బి. వెంకటేశ్వర్లు, కె. విజయ్ కుమార్, వెంకట్ ముదిరాజ్, కె. శంకర్ ముదిరాజ్, సాయి పాల్గొన్నారు.