– నల్లగొండలో ‘ఫీజు రీయింబర్స్మెంట్’పై నాయకులు, మేధావుల రౌండ్ టేబుల్ సమావేశం
రామగిరి, జూలై 21 : రాష్ట్రంలో నిలిచిపోయిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, కాంటెస్టెడ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణ కేంద్రంలో మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను కాపాడటమే లక్ష్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, విద్యార్థి సంఘాల నేతలు, కుల, ప్రజా సంఘాలు, ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు, మేధావులు ఈ సమావేశానికి పెద్ద ఎత్తున హాజరై పెండింగ్ బకాయిలపై ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
కాంగ్రెస్ పాలనలో విద్యా వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో పడింది. సమాజాన్ని భ్రష్టు పట్టించాలనే కుట్రతోనే విద్యాశాఖను తన వద్దే ఉంచుకుని స్వయంగా నాశనం చేస్తున్నారు. పెండింగ్ బకాయిలు విడుదల చేసే వరకు విద్యార్థులకు, యాజమాన్యాలకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది. శాసనమండలిలో ప్రభుత్వంపై పోరాటం చేస్తాం.

‘ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి’
పదవి కాపాడుకునే భయంతో ఇచ్చే హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, మొదటి రోజు నుంచే అవినీతికి పాల్పడుతోంది. నల్లగొండ మంత్రి, ఎమ్మెల్యేల హెలికాప్టర్ పర్యటనలకు రూ.15 లక్షలు ఖర్చు చేసేందుకు డబ్బులు ఉంటాయి గానీ విద్యార్థుల ఫీజులకు నిధులు ఉండవా? ఫీజు రీయింబర్స్మెంట్ కోసం నల్గొండ కేంద్రంగా 10 వేల మంది విద్యార్థులు, తల్లిదండ్రులతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వణికించే ఉద్యమం చేపడతాం.
పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలను చదువుకు దూరం చేసే కుట్ర జరుగుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సూచనల మేరకు ఈ సమావేశం ఏర్పాటు చేశాం. మూసీ ప్రక్షాళనకు, ఫ్యూచర్ సిటీకి, అందాల పోటీలకు, ఢిల్లీ కప్పానికి లక్షల కోట్లు ఉంటాయి కానీ, కమిషన్లు రావు కాబట్టే ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నిధులు ఇవ్వడం లేదు.

‘ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి’
తొలి, మలిదశ ఉద్యమాల్లో విద్యార్థుల భవిష్యత్తే ప్రధాన ఎజెండా. రేవంత్ రెడ్డికి తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు కాబట్టే విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు. లక్ష్మీదేవిలాంటి తెలంగాణ తల్లిని పేదరాశి పెద్దమ్మలా మార్చే కుట్ర చేస్తున్నారు.
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఏ ప్రభుత్వానికి విద్య మొదటి ప్రాధాన్యత కాకపోవడం వల్లే దేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది. రూ. 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న తెలంగాణలో రూ. 1,100 కోట్ల ఫీజు బకాయిలను వెచ్చించే సోయి లేకపోవడం దుర్మార్గం.
కేసీఆర్ హయాంలో గురుకులాలు, మెడికల్ కాలేజీలతో విద్యారంగాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆశ్రమ పాఠశాలలను నిర్వీర్యం చేస్తోంది. విద్యా వ్యవస్థను కాపాడుకోవాలంటే మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వాన్ని తెచ్చుకోవడమే మార్గం.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ సైది రెడ్డి, బీసీ, ప్రజా సంఘాల నేతలు మిరియాల యాదగిరి, దుందుల లక్ష్మీ నారాయణ, జనార్ధన్ గౌడ్, కోడూరి లక్ష్మీ నారాయణ, రఫీ, పాలడుగుల నాగార్జున, రాకేష్ రెడ్డి, ప్రైవేటు కళాశాలల సంఘం ప్రతినిధులు మారం నాగేందర్, హనుమంతు యాదవ్, మల్లారెడ్డి, రాజేందర్ రెడ్డి, రాపోలు శ్రీజ, విద్యార్థి సంఘాల (BRSV, MSF, SFI, DYFI) నాయకులు నాగార్జున, షోయబ్, రమేష్, వాడపల్లి నవీన్, పురుషోత్తం యాదవ్, సురేష్, సుధీర్, ఆకారపు నరేష్, మల్లం మహేష్, దేవేందర్ రెడ్డి, పిల్లట్ల రవి పాల్గొన్నారు.

‘ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి’