నమస్తే యంత్రాంగం, అక్టోబర్ 4: చెడగొట్టు వాన రైతులను ఆగం జేసింది. చేతికొచ్చిన పంటలను దెబ్బతీసింది. నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. బలమైన గాలులు కూడా తోడు కావడంతో చేతికొచ్చిన వరి పంట దెబ్బతిన్నది. దీంతో రైతాంగం దిగాలు చెందుతున్నది. బోధన్ మండలంలోని అమ్దాపూర్, ఊట్పల్లి, రాజీవ్‌నగర్ తండా శివారులో కురిసిన భారీ వర్షానికి వరి పైర్లు దెబ్బతిన్నాయి. రెంజల్ మండలంలో 2 సెం.మీటర్లకు పైగా వర్షం కురియడంతో వరి నేలకొరిగింది.
చందూర్, రుద్రూర్ మండలాల్లోనూ పంటలకు నష్టం వాటిల్లింది. ఈదురు గాలులతో కూడిన వర్షంతో కోతకు సిద్ధంగా ఉన్న పంట నేలవాలిందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. పొలాల్లో నీళ్లు నిలిచాయని, నేలవాలిన పైర్లతో ధాన్యం గింజలు దెబ్బతింటాయని వాపోతున్నారు. సిరికొండ మండలంలో ఈదురుగాలులు వీయడంతో న్యావనంది, రావుట్ల, నర్సింగ్‌పల్లి, సిరికొండ, చిన్నవాల్గోట్ గ్రామాల్లో వడ్లు రాలిపోయాయి. దెబ్బతిన్న పంట పొలాలను శుక్రవారం పరిశీలించిన ఏవో నర్సయ్య.. ఉన్నతాధికారులకు నివేదికను పంపిస్తామన్నారు.