లింగంపేట(తాడ్వాయి)/ బాన్సువాడ రూరల్, మే 20: తాడ్వాయి మండల కేంద్రంతోపాటు బాన్సువాడ మండలంలోని బోర్లం, ఇబ్రహీంపేట్, పోచారం రాంపూర్, జక్కల్దాని తండా, తిర్మలాపూర్ తదితర గ్రామాల్లో మంగళవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన వర్షానికి తాడ్వాయి తహసీల్ కార్యాలయం ఆవరణలో చెట్టుకొమ్మలు విరిగిపడ్డాయి. విద్యుత్ తీగలు సైతం తెగిపడిపోయాయి.
కొమ్మలు పడిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. విద్యుత్ తీగలు కింద పడడంతో కార్యాలయానికి వచ్చే గ్రామీణ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈదురు గాలుల కారణంగా తెగి పడిన విద్యుత్ తీగలను సరి చేయాలని స్థానికులు కోరుతున్నారు. బాన్సువాడ పట్టణంలోని ప్రధాన రహదారి జలమమయంకాగా.. కాలువను తలపించింది. పలు గ్రామాల్లో పొలంమడుల్లోకి వర్షపు నీరు చేరింది. అధిక ఉష్ణోగ్రతతో అల్లాడిన ప్రజలకు అకాల వర్షం కాసింత ఉపశమనం కలిగించింది.