లింగంపేట(తాడ్వాయి)/ కామారెడ్డి/రెంజల్, జూన్ 9: ఉమ్మడి జిల్లాలో సోమవారం ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. పలు మండలాల్లో ఆదివారం రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తున్నది. దీంతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రాల్లోని పలు ప్రాంతాలు చెరువులను తలపించాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం సాయంత్రం కురిసిన వర్షానికి పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. రోడ్లన్నీ జలమయ మయ్యాయి. నగరంలో విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది.
కామారెడ్డిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రహరీ కూలిపోయింది. దీంతో మున్సిపల్ అధికారులు జేసీబీ సాయంతో శిథిలాలను తొలగించారు. సబ్ స్టేషన్ వద్ద కురుస్తున్న వర్షానికి విద్యుత్ స్తంభం వంగిపోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. తాడ్వాయిలో విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఎర్రపహాడ్, రెంజల్ మండల కేంద్రంతో పాటు నీలా క్యాంపు శివారులో వర్షం కారణంగా చెట్లు రహదారిపై పడిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
ఈదురుగాలులకు రేకులషెడ్డుపై కూలిన చెట్టు
వినాయక్‌నగర్, జూన్ 9 : నగరంలో సోమవారం సాయంత్రం వీచిన భారీ ఈదురుగాలులు, కురిసిన వర్షానికి ఫూలాంగ్ ప్రాంతంలోని యాదగిరిబాగ్ వద్ద ఓ భారీ వృక్షం నేలకొరిగింది. అక్కడే ఉన్న కల్లు బట్టీ రేకులషెడ్డుపై పడడంతో రేకులు, చెట్టు కింద ఉన్న వ్యక్తి అక్కడే కూరుకుపోయి మృతిచెందాడు. విషయం తెలుసుకున్న నాలుగో టౌన్ ఎస్సై శ్రీకాంత్ ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద తీరును పరిశీలించారు. ఆ ప్రాంతమంతా విద్యుత్ సరఫరా నిలిచిపోయి చీకటిమయంగా ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురయ్యాయి. మృతుడిని ఆర్యనగర్‌కు చెందిన లైన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌గా గుర్తించారు.