ఖలీల్‌వాడి, డిసెంబర్ 22 : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు వచ్చిన వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ దవాఖాన పరిస్థితిని చూసి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దవాఖాన ముందు భాగం డ్యామేజీ కావడం, అద్దాలు ధ్వంసమై ఉండడంతో ఇది దవాఖానేనా లేక ఇంకేమైనానా అని మండిపడ్డారు. మరమ్మతులు ఎందుకు చేయించలేదని ప్రశ్నించారు. అనంతరం దవాఖానలో ఉన్న పేషెంట్లను పలుకరించి అందుతున్న సేవలపై ఆరా తీశారు. దవాఖానలో వసతులు సరిపడా లేవని, సరైన వైద్యం అందడం లేదని వారు చెప్పడంతో ఆయా విభాగాల అధిపతుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాను వైద్యసేవల హబ్‌గా తీర్చిదిద్దాలని, మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. దవాఖాన ఆవరణలో రూ.38.75 కోట్లతో నిర్మించిన మాతాశిశు ఆరోగ్యకేంద్రం, క్రిటికల్ కేర్ యూనిట్‌ని ప్రారంభించారు. కాన్ఫరెన్స్ హాలులో వైద్యాధికారులతో సమావేశం నిర్వహించి, దవాఖానలో సమస్యలు, అందిస్తున్న వైద్యసేవల గురించి తెలుసుకున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
రెంజల్, డిసెంబర్ 22: రెంజల్ మండల కేంద్రంలో రూ.1.56 కోట్లతో నిర్మించిన పీహెచ్సీ భవనాన్ని మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించారు. డిమాండ్ల పరిష్కారం కోసం ‘ఆందోళనలు చేయొద్దు ప్లీజ్’ అంటూ మంత్రి దామోదార రాజనర్సింహ ఆశవర్కర్లను కోరారు. రెంజల్ మండలకేంద్రంలో నూతన పీహెచ్సీ భవనాన్ని ప్రారంభించేందుకు వచ్చిన మంత్రిని ఆశవర్కర్లు కలిశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. తమ ప్రభుత్వంలో ఆర్థిక పరిస్థితులు బాగా లేకనే జాప్యం జరుగుతున్నదని ఆశవర్కర్లను పక్కన నిలుపుకొని, ఫొటోకు ఫోజిచ్చి పంపించారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అందజేసిన అత్యాధునిక పరికరాలు క్యాథ్‌ల్యాబ్ తదితర పరికరాలను వినియోగంలోకి తేవాలని, మెరుగైన వైద్యసేవలందించాలని ఎంఐఎం నాయకులు వినతిపత్రం అందజేశారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానను వెయ్యి పడకలకు పెంచాలని కోరారు.