నిజామాబాద్, అక్టోబర్ 5, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) / ఎల్లారెడ్డి రూరల్, రామారెడ్డి, నాగిరెడ్డిపేట: వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయ ఢంకా మోగిస్తుందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీకి 100 సీట్లు ఖాయమన్నారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. ఓపికతో పని చేస్తే మన ప్రభుత్వమే వస్తుందంటూ కార్యకర్తలకు హితబోధ చేశారు.
రాష్ట్రంలో ఇప్పటికే ప్రజలకు స్పష్టత వచ్చిందన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మాజీ మంత్రి హరీశ్ రావు ఆదివారం పర్యటించారు. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, మాజీ ఎమ్మెల్యేలు హన్మంత్ షిండే, జాజాల సురేందర్, జనార్దన్ గౌడ్‌తో కలిసి పంట నష్టం వాటిల్లిన ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం గాంధారిలో నిర్వహించిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశానికి హాజరై బీజేపీపై నిప్పులు చెరిగారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ లీడర్ తానాజీ రావు, అమెరికా ఎన్ఆర్ఐ కిశోర్ రెడ్డి గులాబీ కండువా ధరించి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పని అయిపోయిందన్నారు. బీజేపీకి 8 మంది ఎంపీలను గెలిపిస్తే గోదావరి పుష్కరాలకు పైసా నిధులు తీసుకు రాలేదని, పక్క రాష్ట్రం ఏపీలో రూ.100కోట్లు తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన్నాడు దేశంలో గోధుమలకు, ధాన్యానికి రూ.1400 కనీస మద్దతు ధర ఉండేదని ఇప్పుడు గోధుమలకు, వడ్లకు అందుతోన్న మద్దతు ధర పోలిస్తే వడ్లు పండించే రైతుకు నష్టం జరుగుతోందన్నారు.
గోధుమలు పండించే ఉత్తర భారతదేశం రైతులకు రూ.216 చొప్పున క్వింటాకు అదనంగా లాభం జరుగుతుంటే వడ్లు పండించే దక్షిణ భారతదేశం రైతుకు నష్టం వాటిల్లుతోందన్నారు. ఈ విధంగా ఎకరాకు రూ.7వేలు కోల్పుతున్నట్లుగా గణాంకాలతో సహా వివరించారు. ఈ విషయంలో రైతులకు జరుగుతోన్న అన్యాయాన్ని మోదీని ప్రశ్నించే దమ్ము 8 మంది బీజేపీ ఎంపీలకు ఉన్నదా? అని హరీశ్ రావు ప్రశ్నించారు.
కామారెడ్డికి భీకర వరదలు వస్తే పైసా సాయం చేయకపోవడంపై హరీశ్ రావు స్పందించారు. ఇలాంటి సీఎం ఉండి ఎందుకు అని ప్రశ్నించారు. వరదల్లో కొట్టుకుపోయిన బ్రిడ్జిలను సీఎం స్వయంగా పరిశీలించినప్పటికీ రిపేర్లు చేస్తలేరన్నారు. ఎకరాకు 10వేలు ఇస్తానని పైసా ఇవ్వలేదని మండిపడ్డారు.
బీజేపీ ఎంపీలతో ఒరిగిందేమిటి?
బీజేపీ మీద ప్రజల్లో భ్రమలు తొలగిపోతున్నాయని, తెలంగాణ రాష్ర్టానికి బీజేపీతో ఒరిగిందేమీ లేదని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచిండ్రు కదా. కేంద్రంతో కొట్లాడి 8 యూరియా సంచులు ఎందుకు తీసుకు రాలేకపోయారంటూ మండిపడ్డారు. స్థానిక సంస్థల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీలుగా బీజేపీ నాయకుడైతే ఏం ఒరుగదన్నారు. బీఆర్ఎస్ నుంచి ఎంపీటీసీ గెలిపిస్తే, జడ్పీటీసీని గెలిపిస్తే మనకోసం కొట్లాడుతారని, వీరంతా కలిసి కేటీఆర్, హరీశ్ రావుకు బలమవుతారన్నారు.
అసెంబ్లీ జరుగుతుంటే ప్రజల సమస్యలపై బీజేపీ ఎమ్మెల్యేలు ఎవడన్నా కొట్లాడిండా అని ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. హరీశ్ రావు పేగులు తెగే దాక కొట్లాడిండని కితాబునిచ్చారు. బీజేపీకి ఓటు వేస్తే అది మురిగి పోతుందన్నారు. బీజేపీ నుంచి కొట్లాడేవాడు ఎవ్వరూ లేరన్నారు. రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటూ ఆయన పరువు తీసుకుంటూనే రాష్ట్రం పరువు తీస్తున్నాడని చెప్పారు. చెప్పులు ఎత్తుక పోయేలా చూస్తున్నారని ఆయన పరువు తీసుకున్నాడని, బిచ్చగాళ్లం అయిపోయామని రాష్ట్రం పరువు తీస్తున్నాడని వివరించారు. అలాంటి సీఎం మనకు అవసరమా అని ప్రశ్నించారు.
బతుకమ్మకు రెండు చీరలు ఇవ్వ చాతనైతలేదు కానీ లక్షల కోట్లు పెట్టి ఫ్యూచర్ సిటీ కడుతారట. అమెరికా చేస్తాడట అంటూ మండిపడ్డారు. వర్షాలకు చిన్న బ్రిడ్జిలు చక్కబెట్టే తెలివి లేదని, తెగిన చెరువులు మంచి చేసే తెలివి లేదని, మూసీ కోసం లక్షన్నర కోట్లు ఖర్చు పెడతారట అంటూ విమర్శించారు. హామీలు అమలు చేస్తే కమీషన్లు రావు కదా, పింఛన్లు పెంచితే కమీషన్లు రావు కదా, ఫ్యూచర్ సిటీ అయితే కమీషన్లు వస్తాయనే రేవంత్ రెడ్డి వాటిపైనే ధ్యాస పెట్టాడని విమర్శించారు. రేవంత్ రెడ్డి దందా ప్రయత్నాలను కేటీఆర్, హరీశ్ రావు అడ్డుకుంటుండడంతోనే వారిపై కక్ష గట్టారని అన్నారు. మక్కలకు రూ.2400, సోయాకు రూ.6వేలు మద్దతు ధర చెల్లించి కొనుగోళ్లు ప్రారంభించాలని సర్కార్‌ను ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
తెలంగాణకు కేసీఆరే శ్రీరామరక్ష…..
తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ పాలననే శ్రీరామరక్ష అని వేముల అన్నారు. మాజీ జడ్పీటీసీ తానాజీరావును తిరి గి పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించే బాధ్యత ఆయన తీసుకోవాలని సూచించారు. పార్టీ కార్యకర్తలను కన్న బిడ్డల్లా చూసుకుంటామని పేర్కొన్నారు. బీజేపీ ఉత్తరాది పార్టీ అని, ఉత్తరాది రాష్ర్టాల అభివృద్ధికి పనిచేస్తది కానీ, దక్షిణాది రాష్ర్టాలను ఏమాత్రం పట్టించుకోదన్నారు. పరిస్థితులన్నీ ప్రజలు, నాయకులు గమనిస్తున్నారని అందుకే బీజేపీ నుంచి ఎంతో మంది నాయకులు నేడు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారన్నారు. ప్రజలకు, నాయకులకు బీజేపీ మీద భ్రమలు తొలగిపోతున్నాయన్నారు.