మద్నూర్ : మద్నూర్ మండల కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ( Integrated schools ) కోసం ప్రభుత్వం రూ. 200 కోట్ల నిధులు మంజూరు చేయడం పట్ట మండల కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం మండల కేంద్రంలోని గాంధీ చౌక్ లో టపాకాయలు కాల్చి, మిఠాయిలు పంచి పెట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy) , ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ( Laxmikantha Rao) చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం పూర్తయితే ఇక్కడి ప్రాంత విద్యార్థులకు చదువుకోవడానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవని నాయకులు అన్నారు. ఇక్కడ ప్రాంతం సైతం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. సుమారు 3 వేల మంది విద్యార్థులు చదువుకునే అవకాశం ఉంటుందని అన్నారు.
ఇంత పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేసి నియోజకవర్గాన్ని ఎడ్యుకేషనల్ హబ్ గా మారుస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు హన్మండ్లు స్వామి, సాయిలు, ప్రజ్ఞా కుమార్, గోపి, హన్మంత్ యాదవ్, బాలు, సచిన్, శ్రీనివాస్, రాజు తదితరులు ఉన్నారు.
,