నిజామాబాద్ రూరల్, జనవరి 11 : ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజాపాలన కార్యక్రమం పేరుతో కాలయాపన చేస్తున్నదని రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. సాధ్యంకాని హామీలు గుప్పించి మాయమాటలతో అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ రాష్ట్ర ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నదని మండిపడ్డారు. నెలరోజుల పాలనతోనే ఆ పార్టీ వైఖరి ఏంటో స్పష్టమవుతున్నదని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో వివిధ మండలాల బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులతో ఆయన గురువారం సమావేశమయ్యారు. కాంగ్రెస్ ప్రభు త్వం నెల రోజుల పాలన, గ్యారెంటీ హామీల అమలుపై అవలంబిస్తున్న తీరుపై మాట్లాడారు. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి, రైతాంగ శ్రేయస్సు కోసం కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలను ఒక్కొక్కటి రద్దు చేసేందుకు సీఎం రేవంత్రెడ్డి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. సదరు ఆలోచనను వెంటనే విరమించుకోకపోతే ప్రజల పక్షాన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పోరాటం చేసేందుకు వెనుకాడబోరని హెచ్చ రించారు. అధికారం చేపట్టిన తేదీ నుంచి వంద రోజుల్లోగా గ్యారెంటీ హామీలను ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో బీఆర్ఎస్ ప్రణాళికాబద్ధంగా పోరాడేందుకు సంసిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకోవడంతోపాటు తెలంగాణకు లక్షల కోట్ల ఆస్తులు సమకూరినట్లు తెలిపారు. వీటిని వెల్లడించకుండా రేవంత్రెడ్డి ప్రభుత్వం.. కుళ్లు బుద్ధితో రాష్ట్రం అప్పుల పాలైందని కుంటి సాకులు చెబుతూ గ్యారెంటీ హామీలు అమలు చేయకుండా తప్పించుకునేందుకు యత్నిస్తున్నదని మండిపడ్డారు. త్వరలో జరగనున్న ఎంపీ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ స్థానాన్ని ఈసారి బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తంచేశారు. ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా ఏడు నియోజకవర్గాల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో సమష్టిగా ముందుకు సాగాల్సిన అవశ్యకతను ప్రతిఒక్కరూ గుర్తించాలని సూచించారు. పకడ్బందీ వ్యూహంతో విపక్ష పార్టీల నాయకుల కల్లబొల్లి, మోసపూరిత మాటలను నమ్మకుండా ప్రజలను చైతన్యపర్చేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ప్రత్యేక చొరవ చూపాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, వివిధ మండలాల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.