కాంగ్రెస్ సర్కారు రైతులను చిన్నచూపు చూస్తున్నది. ఇప్పటికే రుణమాఫీ, రైతుబంధు పెంపు వంటి హామీలను ఎగ్గొట్టిన ప్రభుత్వం.. ఇప్పుడు ధాన్యం సేకరణలోనూ మొండి‘చేయి’ చూపుతున్నది. ఉమ్మడి జిల్లాలో ఆర్భాటంగా ప్రారంభిస్తున్న సోయా, వరి కొనుగోలు కేంద్రాలు నామమాత్రంగానే మారాయి. ఆయా కేంద్రాలు కేవలం ప్రారంభానికే పరిమితమయ్యాయి. తప్పితే ఎక్కడా కాంటా వేసింది లేదు. ఒక్క గింజా కొన్నది లేదు. కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే మద్దతు ధర దక్కుతుందన్న రైతుల ఆశలు అడియాసలయ్యాయి. వర్షాలు కురిసే అవకాశముందన్న వాతావరణ హెచ్చరికలతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. దళారులు చెప్పిన ధరకే తెగనమ్ముకుంటున్నారు.
-మోర్తాడ్/చందూర్, అక్టోబర్ 16
ఉమ్మడి జిల్లాలో జోరుగా వరి, సోయా కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నారు. అధికార పార్టీ నేతలు, అధికారులు ప్రారంభ ఆర్భాటాలకే పరిమితమవుతున్నారు తప్పితే ఎక్కడా కాంటా వేసిన దాఖలాలు లేవు. కమ్మర్‌పల్లిలో ఈ నెల 10న సోయా కొనుగోలు కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో సోయ కొనుగోలు చేస్తామని ప్రకటించారు. కేంద్రాన్ని ప్రారంభించి వారం గడిచినా ఒక్క గింజా కొనలేదు. రైతులు ఉదయమే వెళ్లి పాస్‌బుక్ జిరాక్స్‌లను లైన్లో ఉంచారు.
మధ్యాహ్నం దాటినా ఎవరూ రాలేదు. దీంతో అధికారుల వద్దకు వెళ్లి ఆరా తీస్తే ఇక్కడ కొనుగోలు చేయబోమని స్పష్టంగా చెప్పారు. సోయాలను వేల్పూర్ మార్కెట్ కమిటీకి తీసుకెళ్లి విక్రయించుకోవాలని చెప్పారు. ఖంగుతిన్న రైతులు.. ఈమాత్రం దానికి ఇక్కడ కొనుగోలు కేంద్రం ఎందుకు ప్రారంభించారని నిలదీశారు. మరోవైపు, వేల్పూర్ మార్కెట్ కమిటీలో విక్రయించిన సోయలు వెనక్కి పంపిస్తుండడంతో రైతులు పునరాలోచనలో పడ్డారు. కొనుగోలు కేంద్రాల్లో క్వింటాకు రూ.4,892 మద్దతు ధర దక్కుతుందని భావించిన అన్నదాతలకు నిరాశే మిగిలింది. స్థానికంగా కొనుగోళ్లు లేక, వేల్పూర్‌కు వెళ్లలేక దళారులకే తక్కువ ధరకు విక్రయిస్తున్నారు.
బాన్సువాడ డివిజన్లో వరి కోతలు జోరుగా సాగుతున్నాయి. చందూరు తదితర ప్రాంతాల్లో చివరి దశకు చేరుకున్నాయి. కానీ ఇప్పటికీ కొనుగోలు కేం ద్రాల జాడ లేకుండా పోయింది. వర్షాల ముప్పు పొంచి ఉందన్న వాతావరణ శా ఖ హెచ్చరికలతో రైతులు ఆందోళన చెం దుతున్నారు. పంట కోతలను ముమ్మ రం చేశారు. అయితే, కొనుగోలు కేంద్రా లు అందుబాటులోకి రాకపోవడంతో దళారులు గ్రామాల్లో వాలిపోతున్నారు. పచ్చి వడ్లు సైతం కొం టామని రైతులను ప్రలోభపెట్టి తక్కువ ధరకే ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఓవైపు మేఘావృతమవుతున్న వాతావరణం, మరోవైపు ధాన్యం సేకరణ ప్రారంభం కాకపోవడంతో దళారులు సొమ్ము చేసుకుంటున్నారు.
కేసీఆర్ హయాంలో రైతులకు ఏమాత్రం కష్టా లు లేకుండా చూసుకున్నారు. కరెంట్, నీళ్లు మొదలు పంట సేకరణ దాకా ప్రణాళికాబద్ధం గా వ్యవహరించారు. పంట పెట్టుబడి సాయం తో పాటు మద్దతు ధరకే కొనుగోళ్లు చేస్తూ రైతులకు అండగా నిలిచారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో రైతులకు కష్టాలు మొదలయ్యాయి. హస్తం పార్టీ హామీలను నమ్మిన రైతాంగానికి ప్రభుత్వం షాకుల మీద షాకులు ఇస్తున్నది. కొందరికే రుణమాఫీ చేసిన రేవంత్ సర్కారు.. మిగతా వారికి ఎగ్గొట్టింది. ఇక, పంట వేసే సమయంలోనే ఇవ్వాల్సిన రైతుబంధు సాయం.. పంట కోతలు ముగింపు దశకు చేరుతున్నా ఇవ్వలేదు. వరికి రూ. 500 బోనస్ ఇస్తామని, అధికారంలోకి రాగానే సన్న వడ్లకే అని మాట మార్చింది. మద్దతు ధర చెల్లించి అన్ని పంటలను కొనుగోలు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోయా కొనుగోళ్లు ప్రారంభించకుండా, ధాన్యం సేకరణ చేపట్టకుండా ఇబ్బందులు పెడుతున్నారని మండిపడుతున్నారు.
మార్క్‌ఫెడ్ వాళ్లు కొంటామంటే మద్దతు ధర అస్తదని సంతోషమైంది. మొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభించిండ్రు. అయినా ఒక్క గింజ కూడా కొనలే. అందుకే దళారులకే సోయలను అమ్మేసిన. క్వింటాల్‌కు రూ.4,350 చొప్పున ఇచ్చిండ్రు. అదే మార్క్‌ఫెడ్ కొని ఉంటే నాకు క్వింటాల్‌కు అదనంగా రూ.500 కలిసొచ్చేది. 33 క్వింటాళ్ల సోయలకు లెక్కగడితే రూ.16 వేలకు పైగా నేను నష్టపోయిన. నా లెక్కనే చాలా మంది దళారులకు అమ్మకుని నష్టపోతుండ్రు.
– వేముల గంగాధర్, రైతు, కమ్మర్పల్లి
కమ్మర్‌పల్లిలో సోయా కొనుగోలు కేంద్రం ప్రారంభిస్తుంటే సంతోషపడ్డం. సోమవారం కొనుగోలు చేస్తారని చెప్పంగనే పాస్‌బుక్ జిరాక్స్‌లు లైన్లో పెట్టినం. మధ్యాహ్నమైనా ఒక్కరూ రాలే. ఏమైందని అధికారులను అడిగితే వేల్పూర్‌కు వెళ్లమని చెప్పిండ్రు. అదేదో ముందే చెబితే పొద్దంతా పడిగాపులు కాసేటోళ్లం కాదు కదా. కేంద్రం ఇక్కడ ప్రారంభించినప్పుడు సోయలను ఇక్కడే కొనాల కదా? కమ్మర్‌పల్లిలో గోదాంలు లేవని, వేల్పూర్ వెళ్లాలని అధికారులు చెబుతుండ్రు. గోదాంలు లేవన్న విషయం వాళ్లకు తెల్వదా? తెలిసీ ఎందుకు కమ్మర్పల్లిల కొనుగోలు కేంద్రం ప్రారంభించిండ్రు. మార్క్‌ఫెడ్ వెంటనే స్థానికంగా కొనుగోళ్లు ప్రారంభించాలె.
– రెంజర్ల గంగాధర్, రైతు, కమ్మర్పల్లి