Allu Sirish | మెగా కుటుంబంలో మరో శుభవార్త వినిపించింది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చిన్న కుమారుడు, హీరో అల్లు శిరీష్ తన ప్రేయసి నయనికతో వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. ఈ పెళ్లి వేడుక శుక్రవారం (మార్చి 6, 2026) సాయంత్రం హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. నగరంలోని కొల్లూరు ప్రాంతంలోని ఐనా ఈవెంట్ స్పేస్‌లో జరిగిన ఈ వివాహానికి ఇరు కుటుంబాల సభ్యులు, బంధువులు, సన్నిహితులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇదే రోజున అల్లు శిరీష్ అన్నయ్య, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వివాహ వార్షికోత్సవం కూడా కావడం. దీంతో మెగా కుటుంబంలో ఒకేసారి రెండు ఆనందాలు చోటుచేసుకున్నాయి. పెళ్లి వేడుకకి సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వేడుకకు ప్రత్యేకంగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అలాగే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పెళ్లికి హాజరై ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి వధూవరులకు పుష్పగుచ్ఛం అందించి ఆశీర్వాదాలు తెలిపారు. అనంతరం వధూవరులతో పాటు అల్లు అరవింద్, అల్లు అర్జున్‌లతో కలిసి ఫోటోలు దిగారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక అల్లు శిరీష్, నయనికల ప్రేమ కథ కూడా ఆసక్తికరంగా ఉంది. గత నాలుగు నుంచి ఐదు సంవత్సరాలుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు సమాచారం. కుటుంబ కార్యక్రమాల్లో ఏర్పడిన పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. ఆ తర్వాత పెద్దల అంగీకారంతో ఈ ప్రేమ కథ వివాహ బంధంగా మారింది.
ఇదిలా ఉండగా, పెళ్లికి ముందు మూడు రోజుల క్రితం హైదరాబాద్‌లో ప్రీ-వెడ్డింగ్ రిసెప్షన్‌ను ఘనంగా నిర్వహించారు. ఆ వేడుకకు సినీ పరిశ్రమకు చెందిన అనేకమంది ప్రముఖులు హాజరయ్యారు. అయితే ప్రధాన పెళ్లి వేడుకను మాత్రం చాలా ప్రైవేట్‌గా, కేవలం కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితుల సమక్షంలో నిర్వహించడం విశేషం. ప్రస్తుతం అల్లు శిరీష్ – నయనికల వివాహానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అభిమానులు, సినీ ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మెగా అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా ఈ జంటకు కొత్త జీవితానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.+

Sirish