కంఠేశ్వర్, మే 13: కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యాన్ని రైస్ మిల్లర్లు వెంటనే దిగుమతి చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి రైస్ మిల్ యజమానులకు సూచించారు. ఖానాపూర్లోని పలు రైస్‌మిల్లులను ఆమె బుధవారం తనిఖీ చేశారు. లక్ష్మీ బాలాజీ రైస్‌మిల్, శ్రీ సిద్ధి రామేశ్వర ప్రైవేట్ లిమిటెడ్ మిల్లులను సందర్శించిన ఆమె.. మిల్లులకు కొనుగోలు కేంద్రాల నుంచి ఎన్ని లారీల ధాన్యం పంపించారు..? దానిని దిగుమతి చేసుకున్నారా..? ఎంత పరిమాణంలో మిల్లింగ్ చేశారనే అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
మిల్లుల వద్ద ఏమైనా తరుగు తీస్తున్నారా అని ఆరా తీశారు. అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలని మిల్లర్లకు సూచించారు. మిల్లుల వద్ద ధాన్యం దిగుమతి విషయంలో జాప్యానికి తావు లేకుండా పకడ్బందీగా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట డీఎస్వో శ్రీకాంత్‌రెడ్డి, సివిల్ సప్లయి డీఎం ప్రవీణ్, రైస్‌మిల్లుల నిర్వాహకులు మోహన్‌రెడ్డి, శ్రవణ్‌కుమార్ ఉన్నారు.