ఖలీల్‌వాడి, ఆగస్టు 30: నగరంలోని ప్రభుత్వ జనరల్ దవాఖాన (జీజీహెచ్) రోగులతో కిటకిటలాడుతున్నది. రాష్ట్రంలోనే అత్యధికంగా ఇక్కడ ఓపీ నమోదవుతున్నది. బుధ, గురువారాల్లో 2600లకు పైగా ఓపీ నమోదుతో జీజీహెచ్ రాష్ట్రంలోనే తొలి స్థానంలో నిలిచింది. తాజాగా శుక్రవారం 2700 ఓపీతో రెండో స్థానాన్ని ఆక్రమించింది. ప్రభుత్వ దవాఖానకు కొనసాగుతున్న రోగల తాకిడి జిల్లాలో విష జ్వరాల తీవ్రత ఏ స్థాయిలో ఉందో కళ్లకు కడుతున్నది.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. వైరల్ ఫీవర్, చికున్ గున్యా, డెంగ్యూ వంటివి వ్యాపిస్తుండడంతో ఏ ఇంట చూసినా జ్వరంతో బాధ పడుతున్న వారే కనిపిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానలు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలోనే అత్యధిక ఓపీ నమోదు చేస్తూ నిజామాబాద్ జీజీహెచ్ రికార్డులకెక్కింది. బుధవారం రోజున 2,680, గురువారం నాడు 2,600 ఓపీ నమోదుతో రాష్ట్రంలోనే తొలి స్థానంలో నిలిచింది. శుక్రవారం వరంగల్ ఫస్ట్ ప్లేస్‌లో నిలువగా, 2,700 ఓపీతో మన జీజీహెచ్ రెండో స్థానంలో నిలిచిందని సూపరింటెండెంట్ ప్రతిమరాజ్ తెలిపారు. రోగుల తాకిడి తీవ్రంగా ఉన్నప్పటికీ వైద్య సేవల్లో ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని ఆమె చెప్పారు.
మరోవైపు, విషజ్వరాలతో బాధ పడుతున్న వారితో ప్రైవేట్ దవాఖానలూ సందడిగా మారాయి. మోస్తరు నుంచి సూపర్ స్పెషాలిటీ దవాఖానల వరకు అన్నింట్లోనూ అదే పరిస్థితి నెలకొంది. ఇదే అదనుగా కొందరు నిర్వాహకులు రోగులను దోచుకుంటున్నారు. డెంగ్యూ పేరి చెప్పి, ప్లేట్లెట్స్ పడిపోతున్నాయంటూ డబ్బులు దండుకుంటున్నారు.
జీజీహెచ్‌కు రోగుల తాకిడి బాగా పెరిగింది. రాష్ట్రంలోనే అత్యధికంగా ఓపీ నమోదైంది. శుక్రవారం కూడా 2700 మందికి ఓపీ సేవలు అందించాం. ఎంత మంది వచ్చినా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్నాం.
– ప్రతిమరాజ్, జీజీహెచ్ సూపరింటెండెంట్