రామారెడ్డి, మే 19: వడ్ల కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నిత్యం రోడ్డెక్కి ఆందోళనలు చేపడుతున్నా సర్కారు నుంచి స్పందన కరువైంది. దీంతో ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు నిప్పు పెడుతూ ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో గంటల వ్యవధిలోనే పంటకు నిప్పు పెట్టిన ఘటనలు చోటు చేసుకోవడం గమనార్హం. ఈ ఘటన ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యంతోపాటు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతున్నది.
వడ్లు కాంటాలు చేయడం లేదని, ఒకవేళ చేసినా మిల్లులకు తరలించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రామారెడ్డి మండలంలో రైతులు ధాన్యానికి నిప్పుపెట్టారు. మంగళవారం రాజమ్మ తండాలో ధాన్యం బస్తాలకు నిప్పుపెట్టి నిరసన తెలిపారు. పంటకోసి, ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే హమాలీలు, లారీల కొరత పేరుతో కాంటాలు వేయడం లేదని రైతులు మండిపడ్డారు. మరోవైపు, ఇసన్నపల్లి గ్రామంలోనూ రైతులు సోమవారం రాత్రి ధాన్యం బస్తాలకు నిప్పుపెట్టి నిరసన తెలిపారు. కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయకపోవడం, అకాల వర్షాలు వెంటాడుతుండడంతో ఆగ్రహానికి లోనైన రైతులు వడ్లకు నిప్పు పెట్టి సర్కారు తీరును ఎండగట్టారు.
కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఆర్డీవో
రెండురోజుల్లో ధాన్యం తరలిస్తామని హామీ
రాజమ్మతండాలో కాంటా చేసి నెలలు గడిచినా ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించకపోవడంతో ల్యాగల నరేశ్ అనే రైతు తన ధాన్యం బస్తాలకు నిప్పుపెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న కామారెడ్డి ఆర్డీవో ఎన్వై గిరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించాడు. రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఐకేపీ ఏపీఎంకు పలుమార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని ఈ సందర్భంగా రైతులు ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. ధాన్యం పండించడానికి 100 రోజులు అయితే ధాన్యం అమ్ముకోవడానికి ఎంత సమయం కావాలంటూ ఆర్డీవోను ప్రశ్నించారు. స్పందించిన ఆర్డీవో రెండు రోజులల్లో మొత్తం ధాన్యం తరలిస్తామని వారికి హామీ ఇచ్చారు.ఐకేపీ ద్వారా కాకుండా సహకారం సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా రైతులు కోరారు.