‘ధాన్యం కొనుగోళ్ల’పై ప్రభుత్వ నిర్లక్ష్యం రైతన్నలకు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ప్రభుత్వ ఉదాసీన వైఖరి, రైస్ మిల్లర్ల బాధ్యతారాహిత్యం అన్నదాతలకు తలనొప్పులను తెస్తున్నది. పుట్లకొద్దీ సన్న రకం వడ్లు వస్తుండడంతో వాటిని సీఎంఆర్ రూపంలో తీసుకునేందుకు రైస్ మిల్లర్లు ససేమిరా అంటున్నారు. మర ఆడించిన బియ్యం విషయంలో ప్రభుత్వం చెల్లించే ధరలతో గిట్టుబాటు కాదంటూ వాదిస్తున్నారు. ఈ విషయంలో పలు మినహాయింపుల కోసం రైస్‌మిల్లర్లు చేస్తున్న డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మొండిగా ముందుకెళ్తున్న సర్కారుకు దీటుగా రైస్‌మిల్లర్లు సైతం అదే స్థాయిలో మిన్నకుండిపోతున్నారు. వీరి తీరు ఫలితంగా రైతులు రోడ్డున పడుతున్నారు.
– నిజామాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ధాన్యం సేకరణ అక్టోబర్ మొదటి వారంలోనే షురూ అయ్యింది. అంతకు ముందే ప్రభుత్వం ధాన్యం సేకరణకు పటిష్ట ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. రేవంత్ రెడ్డి సర్కారు మాత్రం మొద్ద నిద్రలో కొనసాగి ఇప్పటికిప్పుడు రైస్ మిల్లర్లతో ఒప్పందాలకు ప్రయత్నాలు చేస్తోంది. బ్యాంక్ ష్యూరిటీ, అఫిడవిట్, బాండ్ పేపర్ ద్వారా ఒప్పందాలు చేసుకోవాలని చెప్పడంతో రైస్ మిల్లర్లు మొండి కేస్తున్నారు. సన్న వడ్లను మర ఆడించడం ద్వారా ప్రస్తుతం చెల్లించే కమీషన్ సరిపోదంటూ వాదిస్తున్నారు. పైగా సీఎంఆర్ కోసం ఒప్పందాలు చేసుకునేందుకు కఠిన నిబంధనలు విధించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డిలో ఒప్పందాలు చేసుకునేందుకు రైస్ మిల్లర్లు క్యూ కడుతున్నారు.
కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ధీమా దక్కడంతో వారంతా సీఎంఆర్ విషయంలో ముందుకెళ్తుండగా.. నిజామాబాద్‌లో పరిస్థితి ఇం దుకు భిన్నంగా ఉన్నది. అతికొద్ది మంది మాత్రమే ష్యూరిటీ ఇవ్వడానికి ముం దుకువచ్చారు. ఒప్పందాలను ఆలస్యం చేయడం ద్వారా రైతుల నుంచి సన్న వడ్లను తక్కువకే లాగేసుకోవచ్చనే ఆలోచనలో ఇక్కడ కొంత మంది రైస్ మిల్ సంఘంలోని కీలక బాధ్యులు కుటిల ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. పలు రాజకీయ పార్టీలతో అంటకాగుతున్న ఓ నాయకుడి దుర్బుద్ధితోనే ప్రభుత్వంతో ఒప్పందాల వ్యవహారంలో జాప్యం జరుగుతున్నట్లు చర్చ నడుస్తోంది.
పంట కోతలు పూర్తయినా ఓ వైపు కొనుగోళ్లు చేపట్టకపోవడం, మరోవైపు అమ్మిన ధాన్యాన్ని రైస్‌మిల్లర్లు దించుకోకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సీఎంఆర్ కేటాయింపు విషయంలో బ్యాంకు ష్యూరిటీ కోసం అఫిడవిట్, బాండ్ పేపర్లను సైతం సమర్పించాలని కాంగ్రెస్ సర్కారు కొత్త నిబంధనలను తెర మీదికి తెచ్చింది. గతంలో కస్టం మిల్లింగ్ రైస్ విషయంలో పలువురు మిల్లర్లు అక్రమాలకు పాల్పడంతో పౌరసరఫరాల శాఖ దిద్దుబాటు చర్యలను చేపట్టింది. ధాన్యం కొనుగోళ్లు మొదలై నెలన్నర రోజులవుతున్నా సర్కారుకు, మిల్లర్ల మధ్య సయోధ్య కుదరకపోవడంతో రైతులు విలవిల్లాడుతున్నారు. దొందూ… దొందే అనే రీతిలో సాగుతున్న మిల్లర్లు, ప్రభుత్వ వైఖరితో అన్నదాతలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
బహిరంగ మార్కెట్లో సన్న వడ్లకు భారీ డిమాండ్ ఉన్నది. కోతలు షురూ అయిన మొదట్లో క్వింటాలు రూ.2300 వరకు వ్యాపారులు కొనుగోలు చేశారు. పచ్చి వడ్లను సైతం సేకరించడంతో అదే అదునుగా భావించి రైతులు సైతం వారికే ముట్ట జెప్పారు. బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాల్లో లక్షలాది ఎకరాల్లో కోతలు షురూ అయినప్పటికీ కొనుగోలు కేంద్రాలు మాత్రం సమయానికి ప్రారంభించకపోవడంతో గత్యంతరం లేక దళారులను ఆశ్రయించారు. దీంతో కాంగ్రెస్ సర్కారు ఇస్తామన్న రూ.500 బోనస్‌ను రైతులు కోల్పోవాల్సి వచ్చింది.
కోతలు మొదలైన సమయంలో గిట్టుబాటు ధర దక్కినప్పటికీ ప్రస్తుతం విపరీతమైన దోపిడీ పర్వం రాజ్యమేలుతోంది. సర్కారు పట్టించుకోకపోవడంతో రైస్ మిల్లర్లు తెగబడి రైతులను ముంచేస్తున్నారు. నిజామాబాద్‌లో 480 కొనుగోలు కేంద్రాల ద్వారా సుమారు 8 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, వ్యాపారులు చొరబడి ఇష్టారీతిన ధాన్యాన్ని సేకరిస్తున్నారు. చాలాచోట్ల అక్టోబర్ నెలాఖరు నుంచి క్వింటాలుకు రూ.2వేల లోపే చెల్లింపులు చేస్తున్నారు. మద్దతు ధర దక్కకపోవడంతో చాలా మంది రైతులు దిగాలు చెందుతున్నారు. ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. మద్దతు ధరకు రైస్ మిల్లర్లు మంగళం పాడుతున్నప్పటికీ పట్టించుకునే నాథుడే లేకపోవడం గమనార్హం.
మార్కెట్లో ధాన్యం రాక మందగించిన సమయంలో ఒప్పందాలు చేసుకుంటే దొడ్డు రకం వడ్లు రెండు లక్షల మెట్రిక్ టన్నులు మిగిలే అవకాశం ఉంది. అనివార్యంగా ఈ మొత్తాన్ని రైస్ మిల్లర్లకే ప్రభుత్వం అప్పగిస్తుంది. తద్వారా రెట్టింపు లాభాలను పొందవచ్చనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. రైస్ మిల్లర్ల తీరును ప్రభుత్వ గమనిస్తున్నప్పటికీ చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. నిజామాబాద్‌లో 39 రైస్‌మిల్లులను బ్లాక్‌లిస్టులో పెట్టారు. వీటిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామంటూ పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రగల్భాలు పలికినప్పటికీ..ఇప్పటివరకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. పైగా రైతులను నిండా ముంచుతున్నవారికి వత్తాసు పలుకుతున్నట్లుగా సర్కారు చర్యలు కనిపిస్తున్నాయని అన్నదాతలు ఆరోపిస్తున్నారు.