తక్కువ సమయంలో కొద్దిపాటి నీటిని ఉపయోగించుకొని చేతికొచ్చే పంట పొద్దు తిరుగుడు పువ్వు. నూనె గింజల్లో ముఖ్యమైనది ఈ పంట. ప్రస్తుత కాలంలో ఈ నూనె వినియోగం ఎక్కువ అవుతుండగా, మార్కెట్లో పొద్దు తిరుగుడుకు డిమాండ్ పెరుగుతున్నది. కర్షకుల ఇంట కాసులు కురిపిస్తున్నది. కేవలం మూడు నెలల్లోనే పంట చేతికి వస్తుంది. కొద్దిపాటి యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి లాభాలు ఆర్జించవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
యాసంగిలో ఎక్కువగా వేసే పంటల్లో పొద్దు తిరుగుడు ఒకటి. దీనికి తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ రాబడి పొందవచ్చు. అయితే ఈ పంట చిన్నకమతాల్లో కాకుండా పెద్ద కమతాల్లో పండించడంతో రైతుకు అన్ని విధాలా సౌకర్యంగా ఉంటుంది. పక్కపక్కన సుమారు 20 నుంచి 25ఎకరాల వ్యవసాయ భూమిలో పొద్దు తిరుగుడు పంట వేయడంతో పక్షులు, కీటకాల ప్రభావం తక్కువగా ఉంటుంది.
పరపరాగ సంపర్కం ద్వారా అంటే ఒక పువ్వు పుప్పొడి వేరొక పువ్వుపై పడినప్పుడు గింజ కడుతుంది. పొలంలో తేనేటిగలు ఒక పువ్వు నుంచి మరొక పువ్వుకు చేర్చి గింజ కట్టడానికి దోహదపడతాయి. పైరు పూత దశలో ఉన్నప్పుడు మెత్తటి గుడ్డతో ఉదయం 8 నుంచి 11గంటల వరకు పువ్వును రుద్దడంతో పరపరాగ సంపర్కం పెంచవచ్చు. పూత దశలో ఈ ప్రక్రియను కనీసం 15రోజులు పాటు కొనసాగించాలి. పూత దశలో క్రిమిసంహారక మందులను వాడడంతో తేనెటీగల సంఖ్య తగ్గుతుంది. పొలంలో తేనెటీగల పెట్టెలు ఉంచితే తేనె దిగుబడితోపాటు పొద్దుతిరుగుడులో తాలుగింజల సమస్య అధిగమించవచ్చు. రసం పీల్చే పురుగుల్లో ప్రధానంగా తామర పురుగులు ఈ పంటను ఆరంభం నుంచి ఆశిస్తాయి. పైరు బెట్టకు గురైనప్పుడు వీటి సమస్య తీవ్రంగా ఉంటుంది. ఇవి ఆశించిన మొక్కల ఆకులు పసుపు పచ్చగా మారి ముడుచుకొని చీలిపోతాయి. మొక్క గిడసబారుతుంది. ఈ పురుగులు పరోక్షంగా నెక్రొసిస్ వ్యాప్తికి కారణమై తీవ్ర నష్టాన్ని కలుగజేస్తాయి. వీటి వ్యాప్తి నిరోధానికి పైరు చుట్టూ 3-4 సాల్లు జొన్న, సజ్జ లాంటి పంటలను విత్తుకోవాలి. ఆకులను తినే పురుగుల్లో పొగాకు లద్దెపురుగు, పచ్చ రబ్బరు పురుగు, దాసరి పురుగు ప్రధానమైనవి. ఇవి మొదటి దశలో ఆకులను గీకి తిని , తర్వాత దశలో ఆకు మొత్తాన్ని తింటాయి. వీటి నివారణకు గుడ్ల సముదాయాలను, పెద్ద పురుగులను పట్టి ఏరివేయాలి. పొగాకు లద్దెపురుగు సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు విషపు ఎర వాడి సమర్థంగా నివారించవచ్చు.
రైతులు ఎప్పటికప్పుడు స్థానికంగా అందుబాటులో ఉండే శాస్త్రవేత్తలు, వ్యవసాయశాఖ అధికారుల సలహాలు, సూచనలను పాటించాలి. ఏ కాలంలో ఎలాంటి పంటలు వేయాలి. వేసి న పంటకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై సూచనలు తీసుకుంటే రైతు వేసిన పంట నుంచి నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకున్నవారవుతారు. లేదంటే తీవ్రస్థాయిలో నష్టపోయే అవకాశాలు ఎక్కువ.
నేల రకం : నీరు నిల్వ ఉండని ఎర్ర చెలకలు. ఇసుక, నల్లరేగడి, ఒండ్రు నేలలు పొద్దుతిరుగుడు సాగుకు అనుకూలం. వర్షాధారంగా పండించాలనుకుంటే బరువైన నల్లరేగడి నేలలు, నీటి వసతి ఉంటే తేలిక నేలల్లో సాగు చేసుకోవచ్చు.
విత్తే సమయం : పొద్దు తిరుగుడు విత్తనం విత్తేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం పూత దశ, గింజలు తయారు అయ్యే దశలో పంట దీర్ఘకాల వర్షంతోకానీ, పగటి ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువ ఉండకుండా చూసుకోవాల్సి ఉంటుంది. యాసంగిలో నవంబర్ రెండవ వారం నుంచి జనవరి మొదటి వారం వరకు విత్తుకోవచ్చు. వేసవిలో నీటి పారుదల కింద జనవరి, ఫిబ్రవరి నెలల్లో కూడా ఈ పంట వేసుకోవచ్చు. పుష్పించే దశ, గింజ గట్టిబడే దశలో ఎక్కువ సూర్యరశ్మి ఉంటే గింజ నిండి నూనె శాతం పెరుగుతుంది.
విత్తనం : అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ రకాన్ని ఎంచుకొని విత్తుకోవాలి. ఎకరానికి 2.5 నుంచి 3కిలోలు విత్తుకోవాల్సి ఉంటుంది. కాలువలు(బోదెలు) తీసి విత్తుకుంటే మొక్కకు పటుత్వం ఉంటుంది. మొక్కకూ మొక్కకు మధ్య 20 నుంచి 25సెం.మీ దూరం ఉండేలా విత్తుకుంటే మంచిది. 10 నుంచి 15రోజుల తర్వాత మంచి మొక్కలను ఉంచి మిగిలిన, ఎదగలేని మొక్కలను తొలగించాలి. దీంతో మొక్క ఎదిగి పువ్వు పరిమాణం పెరిగే అవకాశం ఉంటుంది.
ఎరువులు : ఎకరానికి 2 నుంచి 3టన్నుల పశువుల ఎరువు వాడుకుంటే మంచిది. వర్షాధారపు పంటకు 24కిలోల నత్రజని, 24కిలోల భాస్వరం, 12కిలోల పొటాషియం, 30కిలోల నత్రజని ఎరువులను వాడాలి. గంధకం తక్కువగా ఉన్న నేలల్ల్లో ఎకరానికి 55కిలోల జిప్సం వేస్తే నూనె శాతం పెరుగుతుంది. కాలువలు తీసి సకాలంలో నీటిని అందిస్తే గింజ నిండుకోవడమే కాక నూనె శాతం పెరుగుతుంది.