కామారెడ్డి/ఖలీల్వాడి, ఏప్రిల్ 30 : పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఉమ్మడి జిల్లాలోని బాలికలు సత్తాచాటారు. అత్యధిక మార్కులు సాధించి ప్రతిభచాటారు. కామారెడ్డి జిల్లాలో 94.65శాతం, నిజామాబాద్ జిల్లాలో 96.62 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈసారి విడుదలైన పరీక్షా ఫలితాల్లో కామారెడ్డి రాష్ట్రంలో 20వ స్థానానికి పడిపోయింది. మొత్తం 12,542 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, 11,871 మంది విద్యార్థులు పాసైనట్లు ఇన్చార్జి డీఈవో అశోక్ తెలిపారు.
బాలురు 93.28, బాలికలు 95.96 శాతం, మొత్తం 94.65 శాతం ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 22, 694 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 21, 928 మంది విద్యార్థులు (96.62 శాతం) పాసైనట్లు డీఈవో అశోక్ తెలిపారు. ఫలితాల్లో నిజామాబాద్ జిల్లా 16వ స్థానంలో నిలిచినట్లు పేర్కొన్నారు. జూన్ 3 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఫెయిల్ అయిన విద్యార్థులకు జూన్ 3 నుంచి 13 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారని డీఈవో తెలిపారు.