మద్నూర్, నవంబర్ 17 : కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలకేంద్రంలో జిన్నింగ్ వ్యాపారులు పత్తి కొనుగోళ్లను సోమవారం నిలిపివేశారు. మిల్లుకు నిరవధిక బంద్ ఫ్లెక్సీని ఏర్పా టు చేసి, రైతులు సహకరించాలని కోరారు. సీసీఐ అధికారులు ఎల్1, ఎల్2, ఎల్3 పేరిట మిల్లులు నడుపుతూ నిర్ణయం తీసుకోవడంతో పత్తి కొనుగోళ్లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఎలాంటి కొర్రీలు లేకుండా అన్ని మిల్లులు నడపాలని ఎన్నిసార్లు విన్నవించినా అధికారులు పట్టించుకోకపోవడంతో సీసీఐతో పాటు ప్రైవేటు కొనుగోళ్లు సైతం నిలిపివేస్తున్నట్లు స్పష్టంచేశారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జిన్నింగ్ మిల్లుల కేటగిరీ విభజనతో తెలంగాణ రాష్ట్ర కాటన్ అసోసియేషన్ పిలుపు మేరకు జిన్నింగ్ వ్యాపారులు సోమవారం నుంచి పత్తి కొనుగోళ్లు చేపట్టబోమని నిరవధిక బంద్కు పిలుపునిచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఎల్1, ఎల్2, ఎల్3 అమలు చేయడంతో వ్యాపారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. రైతుల నుంచి పత్తిని కొనుగోళ్లు చేస్తున్న సీసీఐ.. ప్రైవేట్ జిన్నింగ్ మిల్లులను లీజుకు తీసుకొని పత్తిబేళ్లను తయారు చేయిస్తున్నది.
సీసీఐ బేళ్ల తయారీలో ఎల్1, ఎల్2, ఎల్3 నిబంధనలు అమలు చేయడంతో జిన్నింగ్ వ్యాపారులు నష్టపోతున్నారు. నిబంధనలు సడలించాలని తెలంగాణ రాష్ట్ర కాటన్ అసోసియేషన్ నాయకులు.. అధికారులను కోరినా వారు స్పందించడం లేదు. దీంతో జిన్నింగ్ వ్యాపారులు తమ పరిశ్రమలను మూసివేసి పత్తి కొనుగోళ్ల నిరవధిక బంద్కు పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, జిన్నింగ్ మిల్లుల యజమానుల నిర్ణయాలతో మధ్యలో పత్తి రైతు చిత్తు అవుతున్నాడు.
పండించిన పంటను అమ్మకోవడానికి పత్తి రైతులకు కష్టాలు తప్పడం లేదు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో వ్యాపారులు బంద్కు పిలుపునివ్వడంతో రైతులు ఎక్కడికెళ్లి పంటను అమ్ముకోవాలో తెలియని పరిస్థితి నెలకొన్నది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి రైతన్నలు ఇబ్బందులు పడుతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదనే విమర్శలు వస్తున్నాయి. మద్దతు ధర క్వింటాలుకు రూ. 8110 ఉన్నప్పటికీ సీసీఐ పెట్టిన కొర్రీలతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నది. బయట మార్కెట్లో అమ్ముకోవాలంటే రూ.7 వేల వరకు మాత్రమే కొనుగోలు చేస్తారు. దీంతో రైతు క్వింటాకు వెయ్యి రూపాయలు నష్టపోతున్నాడు. ప్రస్తుతం నిరవధిక బంద్కు జిన్నింగ్ మిల్లుల యాజమానులుపిలుపునివ్వడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
ప్రభుత్వాలు పత్తిని ఎలాంటి కొర్రీలు లేకుం డా కొనుగోలు చేయాలి. సీసీఐ, పత్తి వ్యాపారుల మ ధ్య మేము నష్టపోతున్నా ము. సంవత్సరానికి ఒకే పంట అయినటువంటి పత్తికి పెట్టుబడి అధికమై, సరైన ధరలు లేక ఇప్పటికే తీవ్రంగా నష్టపోయాము. ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా పత్తిని కొనుగోలు చేయాలి.
-నాగనాథ్, రైతు, మద్నూర్
పత్తి కొనుగోళ్లు త్వరగా ప్రారంభమయ్యేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. సీసీఐ అధికారులు, వ్యాపారులు త్వరగా మాట్లాడుకొని కొనుగోళ్లు చేయాలి. ఇప్పటికే సరైన పంట దిగుబడి రాక తీవ్రనష్టంలో ఉన్నా ము. ఎకరానికి 12 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేయా లి. రైతులు పండించిన పంట ను కొనుగోలు చేయకపోతే పూర్తిగా నష్టపోయి, బతకడం కష్టమవుతుంది.
-రాజు, రైతు, మద్నూర్