సుభాష్‌నగర్, మార్చి 30: పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం మనల్ని బాధిస్తోంది. నెల రోజులుగా సాగుతున్న సమరం సామాన్యుల్ని సతాయిస్తోంది. చివరకు వంటింటికీ ‘యుద్ధ’ సెగ తగిలింది. ఇప్పటికే గ్యాస్ సరఫరాలో సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు వంట నూనెల ధరలు పెరగడంతో పేదల కష్టాలు మరిం త రెట్టింపయ్యాయి. నెల క్రితం రూ.150 లోపు ఉన్న లీటర్ నూనె ప్యాకెట్ ధర ఇప్పుడు రూ.170కి పైగా చేరింది. కేవలం పది రోజుల వ్యవధిలోనే సగటున రూ.6 నుంచి రూ.10 వరకు పెరగడంతో జనం బెంబేలెత్తి పోతున్నారు.
ఒకవైపు ధరలు పెంచుతున్న కంపెనీలు మరోవైపు ప్యాకింగ్ విషయంలో మాయాజాలం ప్రదర్శిస్తున్నాయి. సాధారణంగా వినియోగదారులు నూనె ప్యాకెట్‌ను కొనేటప్పుడు ధరను గమనిస్తారే తప్ప అది ఎంత పరిమాణం ఉందనేది నిశితంగా చూడరు. ఇదే అదనుగా పలు కంపెనీలు లీటర్ ప్యాకెట్లో ఉండాల్సిన 900 గ్రాములకు బదులుగా, 850 గ్రాములు లేదా 800 గ్రాముల నూనె మాత్రమే నింపి మార్కెట్లోకి వదులుతున్నాయి. అంటే పరోక్షంగా ప్రజలు తక్కువ నూనెకు ఎక్కువ డబ్బులు చెల్లిస్తున్నారు. వ్యాపారులు సాగిస్తున్న ఈ దందాపై అధికారులు తక్షణమే స్పందించి బ్లాక్ మార్కెట్‌కు అడ్డుకట్ట వేయాలని సామాన్యులు కోరుతున్నారు.
వంటనూనెల ధరలు ఆకాశాన్ని అంటడానికి ప్రధానంగా పలు కారణాలు ఉన్నా యి. పశ్చిమాసియా యుద్ధం కారణంగా సరఫరా గొలుసు వ్యవస్థకు తీవ్ర ఆటం కం ఏర్పడింది. వంట నూనెల దిగుమతిపై ఆధారపడిన మన దేశానికి ఇది ఇబ్బందికరంగా మారింది. మరోవైపు, కేంద్రం ఇటీవల నిత్యావసరాలపై విధించిన ట్యాక్స్ కూడా ధరల పెరుగుదలకు కారణమైంది. దీనికి తోడు పండుగలు, పెండ్లిండ్ల సీజన్ కావడంతో వంట నూనెలకు ఒక్కసారిగా డిమాండ్ పెరింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ కారణాలు, సరఫరా వ్యవస్థలో ఆటంకాలను సాకు గా చూపి స్థానిక వ్యాపారులు ఇష్టానుసారం రేట్లు పెంచేస్తున్నారు.
పశ్చిమాసియా యుద్ధం కారణంగా హోటళ్లు, రెస్టారెంట్లు, కర్రీ పాయింట్లకు కష్టకాలం దాపురించింది. ఇప్పటికే వంటగ్యాస్ సరఫరాలో ఆటంకాలు ఆయా వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గ్యాస్ దొరక్క కట్టెల పొయ్యిలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు, పెరిగిన వంట నూనె ధరలు మరింత భారంగా మా రాయి. గ్యాస్ దొరక్క పోవడం, నూనె ప్రియం కావడంతో హోటళ్లు, కర్రీ పాయింట్లు మూతపడుతున్నాయి.