ఖలీల్‌వాడి, నవంబర్ 21: ఆరు గ్యారెంటీలు అమలుకావడంలేదని ప్రజలు అంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ వారి పదవులకు రాజీనామా చేస్తారా అని జడ్పీ మాజీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు ప్రశ్నించారు. జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో ఏ ఒక్కటీ అమలు కావడంలేదన్నారు. రూ. 2 లక్షల రుణమాఫీ కాలేదని, రైతు భరోసా ఊసే లేదన్నారు. అన్ని రకాల పంటలకు రూ.500 బోనస్ కూడా లేదని మండిపడ్డారు.
రైతన్నలకు బీమా ఉన్నదా లేదా అనే విషయంపై అయోమయ పరిస్థితి నెలకొన్నదన్నారు. కౌలు రైతులకు రైతు భరోసా, రైతు కూలీలకు రూ. 12 వేలు ఎక్కడ అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు.. నిర్వహణ లోపంతో అస్తవ్యస్తంగా మారాయన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి, మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డికి ఛాలెంజ్ విసిరే స్థాయి డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డికి లేదన్నారు. సమావేశంలో నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, నగర అధ్యక్షుడు సిర్ప రాజు, పార్టీ సీనియర్ నాయకులు సత్యప్రకాశ్, తెలంగాణ శంకర్, శేఖర్ రాజు, ఫహీం ఖురేషీ, నర్సాగౌడ్, విజయ్‌కుమార్, సాదిక్, కాళీచరణ్ తదితరులు పాల్గొన్నారు.